
ఆసియాకప్-2025 కోసం టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ సిద్దమయ్యాడు. అయితే ఈ స్ధాయికి చేరుకున్న రింకూ విజయం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. ఒక స్వీపర్‌గా, ఆటోడ్రైవర్‌గా, గ్యాస్ డెలివరీగా బాయ్‌గా పనిచేస్తూనే అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు.
అయితే రింకూ జీవితంలో ఇవే కాకుండా మరో విషాద సంఘటన కూడా దాగి ఉందంట. ఈ యూపీ క్రికెటర్ ఇటీవల రాజ్ షమ్మానీ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా రింకూ సింగ్ చిన్నతనంలో జరిగిన ఓ ఊహించని సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. తన పదేళ్ల వయస్సులో కోతి కరవడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లానని రింకూ చెప్పుకొచ్చాడు.
"నా చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను నేను ఎప్పటికి మర్చిపోలేను. అప్పటిలో మా ఇంట్లో వాష్ రూమ్స్ లేవు. కాబట్టి మేము ఆరు బయటకు వెళ్లేవాళ్లం. ఓ రోజు వర్షం పడుతుండడగా నేను మా అన్నయ్య, కొంత మంది స్నేహితులు కలిసి బయటకు వెళ్లాము.
అయితే కోతి వస్తుంది దూరంగా ఉండండి అంటూ వెనక నుంచి మాకు అరుపులు వినిపించాయి. కానీ అంతలోనే ఆ కోతి వెనక నుంచి నాపై తీవ్రంగా దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయాను. అయినప్పటికి నన్ను అది వదలకుండా కరుస్తూనే ఉంది. నా చేతిలోని ముక్కను తన దంతాలతో లాగేసింది. నన్ను ఆ కోతి నుంచి కాపాడానికి అక్కడ పెద్దగా జనం లేరు.
మా అన్నయ్య మాత్రం కోతిపై రాళ్లు విసిరి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది నన్ను వదలలేదు. అది నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను. అప్పటికే నా చేతి నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది.
నా చేతిలోని ఎమకులు బయటకు కన్పించాయి. తరువాత మేము ఒక క్లినిక్‌కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ డ్రెస్సింగ్ చేశారు. అయినప్పటికి చాలా రక్తం బయటకు వచ్చిస్తోంది. నేను బ్రతుకుతానో లేదో తెలియక నా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మరో డాక్టర్ వచ్చి నాకు చికిత్స అందించారు. దీంతో నేను ప్రాణపాయం స్ధితి నుంచి తప్పించుకున్నాను.
రెండు చేతులూ ఒకేలా ఉండవు..
ఇటీవలే నేను డెక్సా టెస్టుకు హాజరయ్యాను. రెండు చేతుల మధ్య బరువు కిలో తేడాగా ఉన్నట్లు తేలింది. ఎందుకంటే ఆ కోతి నా చేతిలో ఒక కండను కొరికి బయటకు తీసేసేంది. అందుకే నేనే జిమ్ చేసే సమయంలో ఒక చేతితో ఎత్తగలిగినంత బరువును మరొక చేతితో ఎత్తలేను. రెండు చేతుల మధ్య చాలా తేడా ఉంది. ఆ కోతి ఎవరినీ వదిలిపెట్టలేదు. మా ఐదుగురు సోదరులలో అందరిని కరిచింది" అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: ‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’