రాయల్‌ ‘బిర్లా’ బెంగళూరు | RCB to be acquired by Aditya Birla Group | Sakshi
Sakshi News home page

రాయల్‌ ‘బిర్లా’ బెంగళూరు

Mar 25 2026 4:32 AM | Updated on Mar 25 2026 4:32 AM

RCB to be acquired by Aditya Birla Group

ఆదిత్య బిర్లా గ్రూప్‌ చేతికి ఆర్‌సీబీ

రాజస్తాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేసిన అమెరికా కన్సార్టియం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. లీగ్‌ విలువను చూపిస్తూ రెండు ఐపీఎల్‌ జట్లు కలిపి ఏకంగా సుమారు రూ.32 వేల కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. క్రికెట్‌తో పరిచయం లేని అమెరికా వ్యాపార సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా లీగ్‌తో జత కట్టేందుకు భారీ మొత్తాలతో ముందుకు వచ్చారు. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్‌ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి.  

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఆరంభమైన 2008 నుంచి లీగ్‌లో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యాజమాన్యం తమ జట్టును అమ్మకానికి ఉంచగా... అమెరికాకు చెందిన కాల్‌ సోమాని కన్సార్టియమ్‌ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్‌ టీమ్‌లో 100 శాతం వాటాను దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో ఆరిజోనాకు చెందిన వ్యాపారవేత్త కాల్‌ సోమానితో పాటు రాబ్‌ వాల్టన్, హ్యాంప్‌ ఫ్యామిలీ వాటాదారులుగా ఉన్నారు. 

టెక్నాలజీ సర్వీసెస్‌ అండ్‌ సొల్యూషన్స్, డేటా ప్రైవసీ, ఏఐ గవర్నెన్స్, ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఇన్‌ట్రా ఎడ్జ్, ట్రూయో.ఏఐ, అకడమియన్‌ వంటి సంస్థలకు అధిపతిగా సోమాని ఉన్నారు. రాబ్‌ వాల్టన్‌ ప్రఖ్యాత వాల్‌మార్ట్‌ కంపెనీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీకి హ్యాంప్‌ ఫ్యామిలీ యజమానిగా ఉంది. 

సోమాని రాజస్తాన్‌ జట్టులో 2021 నుంచి చిన్న వాటాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో దానిని సొంతం చేసుకోవడం విశేషం. ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఐపీఎల్‌–2026 ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి జట్టుపై హక్కులు లభిస్తాయి.  

అసాధారణ పెరుగుదల... 
నిజానికి ఐపీఎల్‌లో ఆట, అభిమానులపరంగా చూస్తే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకే చివరి స్థానం దక్కుతుంది. 2008లో తొలిసారి టోర్నీ గెలవడం మినహా ఆ తర్వాత ఎప్పుడూ చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. ఎలాంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే టీమ్‌ సాగుతూ వచ్చింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంగా 2016, 2017 సీజన్లలో టీమ్‌పై నిషేధం కూడా పడింది. 2008లో 67 మిలియన్‌ డాలర్లకు ఈ జట్టు అమ్ముడుపోయింది. నాటి రూపాయి విలువ ప్రకారం జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే! ఇతర ఏడు జట్లతో పోలిస్తే రాజస్తాన్‌ అన్నింటికంటే తక్కువ ధరకు అమ్ముడుపోయింది.   

రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్య హక్కులు (ఇప్పటి వరకు) 
మనోజ్‌ బదాలే (ఎమర్జింగ్‌ మీడియా) 65%, రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ 15%, లక్‌లాన్‌ మర్డోక్‌ 13%, ఇతరులు 7% 
ఎవరు కొన్నారు? 
కాల్‌ సోమాని: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, ఇన్‌ట్రా ఎడ్జ్‌ కంపెనీ సీఈఓ 
రాబ్‌ వాల్టన్‌: వాల్‌మార్ట్‌ కుటుంబ వారసుడు, అమెరికాలోని నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌)లో డెన్వర్‌ బ్రోంకోస్‌ జట్టు యజమాని. 
హ్యాంప్‌ ఫ్యామిలీ: ఫోర్డ్‌ కంపెనీ మరియు ఫైర్‌స్టోన్‌ కుటుంబానికి చెందిన షీలా ఫోర్డ్‌... హ్యాంప్‌ ఫ్యామిలీ కోడలిగా మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఎన్‌ఎఫ్‌ఎల్‌లో డెట్రాయిట్‌ లయన్స్‌ జట్టుకు యజమాని.  

ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అమ్మకం కూడా పూర్తయినట్లు సమాచారం. 1.78 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.16,753 కోట్లు) ఆదిత్య బిర్లా గ్రూప్‌ నేతృత్వంలోని కన్సార్టియం జట్టును సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ టీమ్‌తో పాటు ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లోని ఆర్‌సీబీ జట్టు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఆర్‌సీబీని కొన్న కన్సార్టియంలో నలుగురు భాగస్వాములుగా ఉన్నారు. 

ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్, బోల్ట్‌ వెంచర్స్, బ్లాక్‌స్టోన్స్‌ (బీఎక్స్‌పీఈ) కలిసి భారీ మొత్తానికి బెంగళూరు జట్టును తమదిగా మార్చుకున్నాయి. 2008 తొలి ఐపీఎల్‌ సమయంలో విజయ్‌ మాల్యాకు చెందిన యునైటెడ్‌ స్పిరిట్స్‌ గ్రూప్‌ 111.6 మిలియన్‌ డాలర్లకు (నాటి విలువ ప్రకారం సుమారు రూ.485 కోట్లు) సొంతం చేసుకుంది. బోల్ట్‌ వెంచర్స్‌ తరఫున ప్రముఖ ఇన్వెస్టర్‌ డేవిడ్‌ బ్లిట్జర్స్, బీఎక్స్‌పీఈ తరఫున విరాల్‌ పటేల్‌ టీమ్‌ యాజమాన్యంలో భాగస్వాములు కానుండగా... ఆర్యమాన్‌ బిర్లా చైర్మన్‌గా, టైమ్స్‌ గ్రూప్‌ నుంచి సత్యన్‌ గాజ్‌వాని వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

29 ఏళ్ల ఆర్యమాన్‌ బిర్లా దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు తరఫున  9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 4 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. ‘క్రికెట్‌లో మానసిక ఒత్తిడి’ని తట్టుకోలేనంటూ 2019లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఎంపికైనా... ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక జట్టు చైర్మన్‌గా మళ్లీ అతను ఐపీఎల్‌లో అడుగు పెట్టనున్నాడు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement