హైదరాబాద్‌, ఆంధ్ర బోణీ విజయాలు | Ranji Trophy 2025: Hyderabad, Andhra Pradesh Enrolls Victories | Sakshi
Sakshi News home page

చెలరేగిన అభిరథ్‌, సౌరభ్‌.. హైదరాబాద్‌, ఆంధ్ర బోణీ విజయాలు

Nov 5 2025 11:35 AM | Updated on Nov 5 2025 1:16 PM

Ranji Trophy 2025: Hyderabad, Andhra Pradesh Enrolls Victories

హిమాచల్‌ ప్రదేశ్‌పై 344 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్‌

ఒడిశాపై ఇన్నింగ్స్‌ 50 పరుగుల తేడాతో ఆంధ్రప్రదేశ్‌ ఘన విజయం

 

నాదౌన్‌: రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో హైదరాబాద్‌ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్‌ ‘డి’ మూడో లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

344 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 8/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు... 75.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు సాధించింది. ఓపెనర్‌ అభిరథ్‌ రెడ్డి (200 బంతుల్లో 175 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత సెంచరీ సాధించి హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ రాధేశ్‌ (127 బంతుల్లో 66; 8 ఫోర్లు)తో కలిసి అభిరథ్‌ రెడ్డి రెండో వికెట్‌కు 145 పరుగులు జోడించాడు. రాధేశ్‌ అవుటయ్యాక కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (24; 2 ఫోర్లు), హిమతేజ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తనయ్‌ త్యాగరాజన్‌ (25 బంతుల్లో 29; 2 ఫోర్లు) సహకారంతో అభిరథ్‌ హైదరాబాద్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. 

మూడో వికెట్‌కు రాహుల్‌ సింగ్‌తో 74 పరుగులు జోడించిన అభిరథ్‌æ.... నాలుగో వికెట్‌కు హిమతేజతో 53 పరుగులు... ఐదో వికెట్‌కు తనయ్‌తో 47 పరుగులు జత చేశాడు. హిమాచల్‌ జట్టు బౌలర్లలో ఆర్యమాన్‌ సింగ్‌ మూడు వికెట్లు తీశాడు. తొలి రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్‌జట్టు ఈ గెలుపుతో తమ ఖాతాలో ఆరు పాయింట్లు వేసుకుంది. 

హిమాచల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేయగా... హైదరాబాద్‌ జట్టు 278 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన హిమాచల్‌ 303 పరుగులు చేసి హైదరాబాద్‌కు 344 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రూప్‌ ‘డి’లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరా బాద్‌ జట్టు పది పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.  

ఆంధ్ర బోణీ
కటక్‌: తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న ఆంధ్ర క్రికెట్‌ జట్టు రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్‌ ‘ఎ’ మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 

ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 190/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఒడిశా జట్టు 104.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. రెండు వికెట్లకు 198 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఒడిశా జట్టు చివరి ఎనిమిది వికెట్లను 80 పరుగుల తేడాలో కోల్పోయింది. 

ఓపెనర్‌ గౌరవ్‌ చౌధురీ (80; 10 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సందీప్‌ పటా్నయక్‌ (63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. మూడో వికెట్‌గా గౌరవ్‌ అవుటయ్యాక ఒడిశా ఇన్నింగ్స్‌ తడబడింది. ఈసారి ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఆఫ్‌ స్పిన్నర్‌ త్రిపురణ విజయ్‌ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 

కావూరి సాయితేజ, శశికాంత్, పృథ్వీరాజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగులు చేయగా... ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచినందుకు ఆంధ్ర జట్టుకు ఏడు పాయింట్లు లభించాయి. ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు పడగొట్టిన సౌరభ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

చదవండి: భారీ విజయంతో కర్ణాటక బోణీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement