ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఓ భారీ ఐపీఎల్ రికార్డు సాధించాడు. లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా (50 ఇన్నింగ్స్‌లు) 100 సిక్సర్లు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. నిన్న (మే 22) ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను బాదిన ఏకైక సిక్సర్‌తో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు సీఎస్‌కే ఆటగాడు శివమ్ దూబే పేరిట ఉండేది.
దూబేకు సిక్సర్ల సెంచరీ పూర్తి చేసేందుకు 59 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా, ఈ రికార్డు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 37 ఇన్నింగ్స్‌ల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేశాడు. రెండో స్థానంలో విండీస్‌కే చెందిన ఆండ్రీ రసెల్ ఉన్నాడు. రసెల్‌కు 100 సిక్సర్ల మార్కును తాకేందుకు 47 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వీరిద్దరు మాత్రమే ప్రస్తుతం పాటిదార్ కంటే ముందున్నారు.
బంతుల పరంగానూ అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో పాటిదార్ మూడో స్థానంలోనే ఉన్నాడు. పాటిదార్‌కు ఈ ఘనత సాధించేందుకు 933 బంతులు అవసరం కాగా.. రసెల్ 657 బంతులు, నికోలస్ పూరన్ 884 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (943) పాటిదార్ తర్వాతి స్థానంలో ఉండటం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీ ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో 55 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ అభిషేక్ శర్మ (56), ట్రవిస్ హెడ్ (26), ఇషాన్ కిషన్ (79), హెన్రిచ్ క్లాసెన్ (51), నితీశ్ కుమార్ రెడ్డి (29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినా.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ (44) మెరుపులు మెరిపించగా.. కోహ్లి (15) విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్ (21), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్‌లో గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎలాంటి సుఖం లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకొని ఎలిమినేటర్ గండాన్ని తప్పించుకోలేకపోయింది. మొదటి రెండు స్థానాలను ఖరారు చేసుకున్న ఆర్సీబీ, గుజరాత్ క్వాలిఫయర్-1 బెర్త్‌లు సాధించి, అదనపు అవకాశాలు పొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. అదే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన జట్ల విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లోనూ గెలిస్తేనే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఎదుర్కోబోయే జట్టు ఇంకా ఖరారు కాలేదు. ఈ బెర్త్ కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ పోటీపడుతున్నాయి.


