రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడడంపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రోమి భిందర్‌కు రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అతడిపై నిషేధం కూడా పడుతుందని వార్తలు వచ్చినప్పటికీ బీసీసీఐ మాత్రం రోమి భిందర్‌కు జరిమానాతో సరిపెట్టింది.
ఈ విషయాన్ని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఐపీఎల్‌లో జట్టు మేనేజర్‌లు మొబైల్ ఫోన్‌లు ఉపయోగిం చడానికి అనుమతి ఉన్నప్పటికీ మ్యాచ్ జరిగే సమయంలో ఫోన్ వాడడం నిషేధమని ఆయన తెలిపారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు మాత్రం జట్టు మేనేజర్లు ఫోన్ వాడేందుకు అనుమతి ఉందన్నారు.
ఈ విషయంలో రోమి భిందర్‌కు షోకాస్ నోటీసు కూడా జారీ చేశామని, కానీ నోటీసుపై అతడు ఇచ్చిన వివరణపై యాంటీ కరప్షన్ యూనిట్ అసంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. అయితే రోమి భిందర్‌కు మొదటి ఉల్లంఘన కాబట్టి, నిబంధనల ప్రకారం అతడికి రూ. లక్ష జరిమానాతో సరిపెడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు.
ఈ ఘటనను అందరూ గుణపాఠంగా తీసుకోవాలని, ఆట దెబ్బతినకుండా ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.రాజస్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రోమి భిందర్ డగౌట్‌లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కాడు.
ఆ సమయంలో రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే కూర్చొని ఫోన్ చూడడం వివాదానికి దారి తీసింది. అయితే ఈ చర్యతో వైభవ్ సూర్యవంశీకి సంబంధం లేకపోవడంతో, అతడిని కేవలం హెచ్చరికతోనే సరిపెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ బ్రేకులు వేసింది. మ్యాచ్‌లో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను ఆదివారం కేకేఆర్‌తో ఆడనుంది.


