వారెవ్వా వైభవ్‌ | Rajasthan beat Royal Challengers Bangalore by six wickets | Sakshi
Sakshi News home page

వారెవ్వా వైభవ్‌

Apr 11 2026 2:53 AM | Updated on Apr 11 2026 10:23 AM

Rajasthan beat Royal Challengers Bangalore by six wickets

26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78

రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా నాలుగో విజయం

6 వికెట్లతో ఓడిన బెంగళూరు  

విజయలక్ష్యం ఎంతైతేనేమి... ప్రత్యర్థి ఎవరైతేనేమి... 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి లెక్కే లేదు... అతనికి తెలిసిందల్లా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే... ఐపీఎల్‌లో మరోసారి అతను తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌కు వరుసగా నాలుగో విజయం దక్కగా, బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. 202 పరుగుల ఛేదనలో వైభవ్‌ 78 పరుగుల సహాయంతో 49 బంతుల్లోనే 129కి చేరిన రాజస్తాన్‌కు మిగిలిన 73 పరుగులు రాబట్టడంలో ఇబ్బంది రాలేదు. ధ్రువ్‌ జురేల్‌ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.   

గువాహటి: ఐపీఎల్‌లో మాజీ విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ దూసుకుపోతోంది. శుక్రవారం దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ నిర్ణీత సమయంకంటే 70 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ (40 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, విరాట్‌ కోహ్లి (16 బంతుల్లో 32; 7 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం రాజస్తాన్‌ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచింది. వైభవ్‌ సూర్యవంశీ (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోగా, ధ్రువ్‌ జురేల్‌ (43 బంతుల్లో 81 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు.  

రాణించిన కోహ్లి... 
ఆర్చర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే సాల్ట్‌ (0) వెనుదిరిగినా.... కోహ్లి కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. ఆర్చర్‌ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను సందీప్‌ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. పడిక్కల్‌ (14) విఫలం కాగా, చక్కటి బంతితో కోహ్లిని బౌల్డ్‌ చేసి బిష్ణోయ్‌ దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 61 పరుగులు చేయగా, తక్కువ వ్యవధిలో కృనాల్‌ పాండ్యా (1), జితేశ్‌ శర్మ (5), టిమ్‌ డేవిడ్‌ (13) అవుటయ్యారు. షెఫర్డ్‌ (11 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుకు జడేజా అడ్డుకట్ట వేశాడు.  

ఆఖరి 6 ఓవర్లలో 76 పరుగులు...  
ఆర్‌సీబీ స్కోరు 14 ఓవర్లలో 125/7... తడబడుతూ ఆడిన కెపె్టన్‌ పాటీదార్‌ 26 బంతుల్లో 27 పరుగులే చేయగా... తప్పనిసరి స్థితిలో బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (15 బంతుల్లో 29 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను ఇంపాక్ట్‌ సబ్‌గా జట్టు బరిలోకి దిగింది. ఈ దశలో పాటీదార్‌ చెలరేగిపోయాడు. తర్వాతి 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో అతను 36 పరుగులు రాబట్టాడు. బర్గర్, బిష్ణోయ్‌ ఓవర్లలో అతను రెండేసి సిక్సర్లు బాది 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అతను అవుటైన తర్వాత వెంకటేశ్‌ బాధ్యత తీసుకున్నాడు. సందీప్‌ వేసిన చివరి ఓవర్లో వెంకటేశ్‌ ఫోర్, 2 సిక్స్‌లు బాదడంతో స్కోరు 200 దాటింది.  

జురేల్‌ జోరు... 
భారీ ఛేదనలో రాజస్తాన్‌ వేగంగా దూసుకుపోయింది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన హాజల్‌వుడ్‌ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన యశస్వి జైస్వాల్‌ (13) అదే ఓవర్లోనే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్‌ వైభవ్‌ తనదైన శైలిలో చెలరేగిపోగా, జురేల్‌ కూడా దూకుడు ప్రదర్శించాడు. 

అభినందన్‌ ఓవర్లో జురేల్‌ వరుసగా 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 97కు చేరింది. ఎట్టకేలకు కృనాల్‌ వరుస బంతుల్లో వైభవ్, హెట్‌మైర్‌ (0)లను అవుట్‌ చేయగా, పరాగ్‌ (3) విఫలమయ్యాడు. ఈ దశలో రాయల్స్‌ కాస్త నెమ్మదించింది. వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే జురేల్, రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్‌) సంయమనంతో ఆడి జట్టును గెలిపించారు.  

మళ్లీ అదే బాదుడు... 
వైభవ్‌ సూర్యవంశీ మరోసారి తన స్థాయిని, సత్తాను ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాడు. భువీ వేసిన మొదటి ఓవర్లో 2 ఫోర్లతో మొదలు పెట్టిన అతను అభినందన్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. గత మ్యాచ్‌లో బుమ్రాపై చెలరేగిన తరహాలోనే ఈసారి మరో అంతర్జాతీయ స్టార్‌ బౌలర్‌ హాజల్‌వుడ్‌ పని పట్టాడు. హాజల్‌వుడ్‌ ఓవర్లో వైభవ్‌ వరుసగా 4, 4, 4, 6తో చెలరేగిపోయాడు. 

భువీ వేసిన తర్వాతి ఓవర్లోనూ 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదిన అతను 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్తాన్‌ను నిలువరించే ప్రయత్నంలో పార్ట్‌టైమర్‌ డేవిడ్‌ను ఆర్‌సీబీ బౌలింగ్‌కు దింపగా, వైభవ్‌ వరుసగా రెండు సిక్సర్లతో దాడి చేశాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడిని చివరకు కృనాల్‌ నిలువరించగలిగాడు.  

స్కోరు వివరాలు  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) జురేల్‌ (బి) ఆర్చర్‌ 0; కోహ్లి (బి) బిష్ణోయ్‌ 32; పడిక్కల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) ఆర్చర్‌ 14; పాటీదార్‌ (సి) ఫెరీరా (బి) సందీప్‌ 63; కృనాల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) బిష్ణోయ్‌ 1; జితేశ్‌ (ఎల్బీ) (బి) బ్రిజేశ్‌ 5; డేవిడ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) బ్రిజేశ్‌ 13; షెఫర్డ్‌ (సి) బ్రిజేశ్‌ (బి) జడేజా 22; వెంకటేశ్‌ (నాటౌట్‌) 29; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–0, 2–45, 3–58, 4–62, 5–76, 6–94, 7–125, 8–166. బౌలింగ్‌: ఆర్చర్‌ 3–0–33–2, బర్గర్‌ 3–0–32–0, సందీప్‌ 4–0–47–1, రవి బిష్ణోయ్‌ 4–0–32–2, జడేజా 2–0–14–1, బ్రిజేశ్‌ 4–0–37–2. 

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 13; వైభవ్‌ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 78; జురేల్‌ (నాటౌట్‌) 81; హెట్‌మైర్‌ (సి) హాజల్‌వుడ్‌ (బి) కృనాల్‌ 0; పరాగ్‌ (సి) కృనాల్‌ (బి) హాజల్‌వుడ్‌ 3; జడేజా (నాటౌట్‌) 24 ; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–21, 2–129, 3–129, 4–134. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–37–0, హాజల్‌వుడ్‌ 4–0–44–2, అభినందన్‌ 3–0–54–0, కృనాల్‌ పాండ్యా 4–0–30–2, డేవిడ్‌ 1–0–18–0, షెఫర్డ్‌ 2–0–18–0.  

ఐపీఎల్‌లో నేడు
పంజాబ్‌ X హైదరాబాద్‌    
వేదిక: న్యూ చండీగఢ్‌ 
మధ్యాహ్నం గం. 3:30 నుంచి
చెన్నై X ఢిల్లీ  
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
Advertisement