ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్‌ది ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్ కూడా ఒకటి. అయితే 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుకున్న సందర్భాలు మూడుసార్లు మాత్రమే. అయితే గత సీజన్‌లో జట్టును మొత్తం ప్రక్షాళన చేసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్‌లో మాత్రం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్లో అడుగుపెట్టింది.
అయితే తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడిపోయిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్‌లో తెరవెనుక పరిస్థితులు ఎప్పుడూ సాఫీగా సాగలేదని, ఏదో ఒక విషయంలో లుకలుకలు తలెత్తేవని తెలిపాడు.
పఠాన్ మాట్లాడుతూ.. ‘2008 తొలి సీజన్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ (అప్పటిక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)ప్లేఆఫ్స్‌కు చేరింది. తొలి సీజన్ తర్వాత పంజాబ్ క్రమంగా తమ పట్టును కోల్పోయింది. తొలి సీజన్ తర్వాత కెప్టెన్సీ కొనసాగాల్సింది. కానీ మూడో ఏడాదికే కెప్టెన్సీ మారిపోయింది. అదే వివాదాలకు దారి తీసింది. యాజమానులు, కోచ్‌లు ఇద్దరూ క్రికెట్‌పై కనీస అవగాహన లేనివారు కావడంతో నిర్ణయాల్లో తేడాలు వచ్చాయి.
ఒక యజమాని ఒక టీమ్ కాంబినేషన్ కోరుకుంటే, మరొకరు ఇంకో ప్లాన్ చెప్పడంతో జట్టులో గందరగోళం ఏర్పడేది. నిజానికి పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో ప్రీతిజింటా ఎక్కువ వాటా ఉన్నప్పటికీ, మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్ కూడా జట్టులో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ పార్టనర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో అది ప్రదర్శనపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
18 ఏళ్లలో పంజాబ్ కింగ్స్‌కు 12 మంది కెప్టెన్లు మారడంతో జట్టుపై నమ్మకం తగ్గిపోయింది. ఇప్పుడు అది జట్టుపైనే ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ పంజాబ్‌ను సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం కలుగుతున్నది. కాగా పఠాన్ ఐపీఎల్‌లో తొలి మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టడంతో పాటు 603 పరుగులు సాధించాడు.


