
గుజరాత్ టైటాన్స్‌పై విజయం
శ్రేయస్, శశాంక్ మెరుపులు
సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ పంజా విసిరింది. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య మెరుపులు... చివర్లో శశాంక్ సింగ్ ఫినిషింగ్ టచ్... ఇన్నింగ్స్ ఆసాంతం శ్రేయస్ అయ్యర్ దూకుడు... వెరసి పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో తగ్గేదేలే అన్నట్లు బాదిన గుజరాత్ చివరకు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 11 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోగా... ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ సిక్సర్లతో రెచ్చిపోగా... శశాంక్, ప్రియాంశ్ ఆర్య బౌండరీల మోత మోగించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయికిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది.
కెప్టెన్ ఇన్నింగ్స్...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 28 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో ప్రియాంశ్ దూకుడు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన ప్రియాంశ్... సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో 6, 4 బాదాడు.
అయ్యర్ వచ్చిరాగానే 4, 6తో చాంపియన్స్ ట్రోఫీ ఫామ్ కొనసాగించగా... ఐదో ఓవర్‌లో ప్రియాంశ్ 4, 4, 6, 4 కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 73/1తో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు కాస్త ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక మందగించగా... సాయికిషోర్ వరుస బంతుల్లో అజ్మతుల్లా (16), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. ఎదుర్కొన్న తొలి బంతికే మ్యాక్స్‌వెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
అయితే రివ్యూలో బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. 2 రివ్యూలు ఉన్నా పంజాబ్ సరైన సమయంలో వినియోగించుకోలేక స్టార్ బ్యాటర్ వికెట్ కోల్పోయింది. అవన్నీ మరిపించేలా అయ్యర్, శశాంక్ ఆఖర్లో బౌండరీలతో రెచ్చిపోయారు. సాయికిషోర్ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన శ్రేయస్... రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు కొట్టాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టొయినిస్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా సాయికిషోర్‌కు వికెట్ సమర్పించుకోగా... ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో శ్రేయస్ 6, 4, 6, 6 కొట్టి 90 పరుగుల మీదకు చేరాడు.
మరో 3 ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో ఐపీఎల్లో అయ్యర్ తొలి సెంచరీ ఖాయమే అనుకుంటే... ఆఖర్లో అతడికి ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 18వ ఓవర్లో 6, 4, 6 కొట్టిన శశాంక్ సింగ్.. చివరి ఓవర్‌లో 5 ఫోర్లు బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు.

చివర్లో చిత్తు...
భారీ లక్ష్యం కళ్లెదురుగా ఉన్నా... గుజరాత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నాలుగో ఓవర్‌లో గిల్ 6, 6, 4తో మోత ప్రారంభించగా... సుదర్శన్ దాన్ని కొనసాగించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా బంతి తన పరిధిలో ఉంటే దానిపై విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో గిల్ వెనుదిరగగా... బట్లర్ చక్కటి షాట్లతో అలరించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 104/1తో నిలిచింది. ఈ క్రమంలో సుదర్శన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
11వ ఓవర్లో బట్లర్ 2 సిక్స్‌లు కొట్టగా... తదుపరి ఓవర్లో సుదర్శన్ 4, 6, 4 బాదాడు. సుదర్శన్ ఔటయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ కూడా అలరించాడు. చివర్లో వైశాఖ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... లక్ష్యంవైపు సజావుగా సాగుతున్న గుజరాత్ ఒక్కసారిగా వెనుకబడింది. చివరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 15 పరుగులే చేసింది.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ 47; ప్రభ్‌సిమ్రన్ (సి) అర్షద్ (బి) రబడ 5; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 97; అజ్మతుల్లా (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 16; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) సాయికిషోర్ 0; స్టొయినిస్ (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 20; శశాంక్ సింగ్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 243. వికెట్ల పతనం: 1–28, 2–79, 3–105, 4–105, 5–162. బౌలింగ్: సిరాజ్ 4–0– 54–0; రబడ 4–0–41–1; అర్షద్ 1–0–21 –0; రషీద్ 4–0–48–1; ప్రసిధ్ కృష్ణ 3–0–41–0; సాయికిషోర్ 4–0–30–3.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 74; గిల్ (సి) ప్రియాంశ్ (బి) మ్యాక్స్‌వెల్ 33; బట్లర్ (బి) యాన్సెన్ 54; రూథర్‌ఫర్డ్ (బి) అర్ష్ దీప్ 46; తెవాటియా (రనౌట్) 6; షారుక్ (నాటౌట్) 6; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 232. వికెట్ల పతనం: 1–61, 2–145, 3–199, 4–217, 5–225, బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–36–2; అజ్మతుల్లా 2–0–29–0; యాన్సెన్ 4–0–44–1; మ్యాక్స్‌వెల్ 2–0–26–1; స్టొయినిస్ 2–0–31–0; చహల్ 3–0–34–0; వైశాఖ్ 3–0–28–0.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ X కోల్‌కతా
వేదిక: గువాహటి
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం