గెలిపించిన గ్రీన్‌ | PSL 2026: chris green help islamabad united to win | Sakshi
Sakshi News home page

గెలిపించిన గ్రీన్‌

Apr 9 2026 7:01 PM | Updated on Apr 9 2026 7:31 PM

PSL 2026: chris green help islamabad united to win

ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలర్‌ క్రిస్‌ గ్రీన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో సత్తా చాటాడు. ఈ లీగ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రీన్‌.. లాహోర్‌ ఖలందర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 9) జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా (4-0-13-3) బౌలింగ్‌ చేయడంతో పాటు 3 కీలక వికెట్లు తీసి ప్రత్యర్దిని దారుణంగా దెబ్బకొట్టాడు. ఫలితంగా అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది.

గ్రీన్‌తో పాటు షాదాబ్‌ ఖాన్‌ (4-0-18-2), ఇమాద్‌ వసీం (4-0-13-2), రిచర్డ్‌ గ్లీసన్‌ (3-0-13-2), ఫహీమ్‌ అష్రఫ్‌ (2.3-0-21-1) సత్తా చాటడంతో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఇస్లామాబాద్‌ లాహోర్‌ను 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్‌ చేసింది. లాహోర్‌ ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన సికందర్‌ రజా టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. హసీబుల్లా ఖాన్‌ (19), అబ్దుల్లా షఫీక్‌ (10), ఆసిఫ్‌ అలీ (15) రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్‌ 10.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. డెవాన్‌ కాన్వే (59 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. అతనికి మొహమ్మద్‌ ఫైక్‌ (34 నాటౌట్‌) సహకరించాడు. ఇస్లామాబాద్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ (సమీర్‌ మిన్హాస్‌ (5)) లాహోర్‌ కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిదికి దక్కింది.

ఎవరీ క్రిస్‌ గ్రీన్‌..?
32 ఏళ్ల కుడి చేతి వాటం ఆఫ్‌ స్పిన్నర్‌ క్రిస్‌ గ్రీన్‌ ఫ్రాంచైజీ క్రికెట్‌లో సుపరిచితుడు. సౌతాఫ్రికాలో పుట్టి ఆస్ట్రేలియా తరఫున ఓ టీ20 ఆడిన గ్రీన్‌.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి క్రికెట్‌ లీగ్‌లో ఆడాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇతనికి మంచి పేరు వచ్చింది. అయితే బౌలింగ్‌ శైలి వివాదాస్పదంగా ఉండటం అతని కెరీర్‌ను సజావుగా సాగనివ్వలేదు. ఈ గ్రీన్‌ ఐపీఎల్‌లోనూ ఓ మ్యాచ్‌ ఆడాడు. 

యాదృచ్చికంగా ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న కెమరూన్‌ గ్రీన్, ఈ క్రిస్‌ గ్రీన్‌ కేకేఆర్‌ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించారు. క్రిస్‌ గ్రీన్‌ను కేకేఆర్‌ 2020 ఎడిషన్‌లో రూ. 20 లక్షలకు సొంతం చేసుకోగా.. కెమరూన్‌ గ్రీన్‌ను 2026 వేలంలో కేకేఆర్‌ ఏకంగా రూ. 25. 20 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా కెమరూన్‌ గ్రీన్‌ రికార్డుల్లోకెక్కాడు. అయితే తనపై పెట్టిన పెట్టుబడికి గ్రీన్‌ న్యాయం చేయలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతూ, అస్సలు బౌలింగే చేయడం లేదు. 

Advertisement
 
Advertisement
Advertisement