పాకిస్తాన్ సూపర్ 2026లో గందరగోళం నెలకొంది. క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ ఒకే మ్యాచ్‌లో బెవాన్ జాకబ్స్, అతని ప్రత్యామ్నాయంగా ప్రకటించిన దినేశ్ చండీమల్‌ను బరిలోకి దించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన బెవాన్ జాకబ్స్ జాతీయ విధుల నిమిత్తం (బంగ్లాదేశ్‌తో సిరీస్) జట్టుకు అందుబాటులో ఉండడని గ్లాడియేటర్స్ యాజమాన్యం ఏప్రిల్ 16న ప్రకటించింది. అదే సమయంలో అతనికి ప్రత్యామ్నాయంగా శ్రీలంకకు చెందిన దినేశ్ చండీమల్ పేరును కూడా వెల్లడించింది.
అయితే లాహోర్ ఖలందర్స్‌తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో జాకబ్స్, చండీమల్ ఇద్దరి పేర్లు ప్లేయింగ్ ఎలెవెన్‌లో కనిపించాయి. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఒకే మ్యాచ్‌లో జాకబ్స్, అతని రీప్లేస్‌మెంట్ ఎలా బరిలోకి దిగుతారని చర్చించుకున్నారు.
ఈలోపు గ్లాడియేటర్స్ యాజమాన్యం నాలుక కరుచుకుని చండీమల్ జాకబ్స్‌కు ప్రత్యామ్నాయం కాదు, టామ్ కర్రన్‌కు అంటూ ప్రకటన చేసింది. కర్రన్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అతని స్థానంలో చండీమల్ జట్టులోకి వచ్చాడని పేర్కొంది.
ఈ గందరగోళం చూసి ఏం జరుగుతుందో అర్దం కాక గ్లాడియేటర్స్ అభిమానులే జుట్టు పీక్కున్నారు. నెటిజన్లు అయితే ఇలాంటి సిత్రాలన్నీ పాకిస్తాన్‌లో మాత్రమే సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఘోర తప్పిదం జరిగిన ఈ మ్యాచ్‌లో ఖలందర్స్‌పై గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చండీమల్ (3) విఫలం కాగా.. జాకబ్స్ (14 నాటౌట్) గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.


