
భారత హాకీ జట్లకు వరుస పరాజయాలు
సాక్షి క్రీడా విభాగం: భారత పురుషుల హాకీ జట్టు నెల రోజుల క్రితం వరకు కూడా ప్రపంచంలో బలమైన జట్లలో ఒకటిగా కనిపించింది. వరుస విజయాలు, ఫామ్‌లో చూస్తే సరైన దిశలో నడుస్తున్నట్లుగా, మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోయే సత్తా ఉన్న టీమ్‌లా అనిపించింది. ఇదే ఉత్సాహంతో యూరోపియన్ టూర్‌కు జట్టు సిద్ధమైంది. అయితే నెల రోజులు తిరిగేసరికి పరిస్థితి అంతా మారిపోయింది. ఇంతకాలం ఆశలు రేపిన జట్టు ఇదేనా అన్న తరహాలో ప్రొ లీగ్‌లో పేలవమైన ఆటను చూపించింది. ఆటగాళ్లతో పాటు కోచ్‌లు కూడా అంచనాలకు పూర్తి భిన్నంగా విఫల ప్రదర్శనతో వెనుదిరిగారు. పురుషుల జట్టుతో పోలిస్తే భారత మహిళల బృందం మరింత నాసిరకం ఆటను ప్రదర్శించింది. ఎంతో అనుభవం ఉన్నా... లీగ్‌లో కనీస స్థాయిలో ప్రమాణాలు కూడా చూపించకుండా చతికిల పడింది. మున్ముందు ప్రతిష్టాత్మక ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు టీమ్‌లు ఏమాత్రం పట్టు సాధిస్తాయనేది చూడాలి.
మూడు నుంచి ఎనిమిదో స్థానానికి...
భువనేశ్వర్‌లో జరిగిన తొలి అంచె ప్రొ లీగ్ పోటీల్లో 8 మ్యాచ్‌ల ద్వారా 15 పాయింట్లు సాధించిన భారత పురుషుల జట్టు మూడో స్థానంతో మెరుగైన రీతిలో ముగించింది. కానీ యూరోప్‌లో జరిగిన రెండో అంచె పోటీల్లో 8 మ్యాచ్‌లలో కేవలం 3 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఫలితంగా తొమ్మిది జట్ల టోర్నీలో ఎనిమిదో స్థానానికే పరిమితమైంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత హాకీ చరిత్రలో తొలిసారి వరుసగా ఏడు మ్యాచ్‌లు ఓడిన చెత్త రికార్డు కూడా నమోదైంది. ఒకదశలో టైటిల్ రేసులో నిలిచిన జట్టు పరిస్థితి చివరకు ఇలా తయారైంది. ఐర్లాండ్‌లాంటి బలహీన జట్టుతో గెలిచిన అదృష్టం వల్ల ఆఖరి స్థానం రాకుండా తప్పించుకోగలిగింది! అయితే ఇన్ని మ్యాచ్‌లు ఓడినా ఇవన్నీ హోరాహోరీగా సాగి చివరి వరకు పోరాడినవి కావడం కొంత సానుకూలాంశం. ఈ ఏడు పరాజయాల్లో ఆరింటిలో భారత్ ఒకే ఒక గోల్ తేడాతో మాత్రమే ఓడింది. వాటిలో ఐదూ చివరి క్వార్టర్‌లోనే వచ్చాయి. చివర్లో డిఫెన్స్ వైఫల్యంతో ఇది జరిగింది.
దీనిపై దృష్టి పెట్టి సరిదిద్దుకునే అవకాశం జట్టు ముందుంది. యూరోప్ టూర్ ఆరంభంలో వీసా సమస్యల వల్ల పలువురు ఆటగాళ్లు ఆలస్యంగా జట్టుతో చేరగా, గుర్జంత్ సింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గాయాలతో ఇబ్బంది పడ్డారు. పూర్తిగా అటాకింగ్‌పైనే దృష్టి పెట్టాలంటూ కోచ్ క్రెయిన్ ఫుల్టన్ కొత్త వ్యూహాన్ని తీసుకురావడంతో ఆటగాళ్లు ఒక్కసారిగా దానికి అనుగుణంగా మారలేకపోయారు. దీంతో మరో వైపు డిఫెన్స్ బలహీనంగా మారిపోయింది. ట్యాకిల్ సరిగా లేక, పొజిషనింగ్ సరిగా లేక జట్టు ఈ ఎనిమిది మ్యాచ్‌లలో 26 గోల్స్ సమర్పించుకుంది!
మార్పులు ఉంటాయా...
సీనియర్లు అమిత్ రోహిదాస్, జుగ్‌రాజ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్ పూర్తిగా విఫలం కాగా... అభిõÙక్ ఒక్కడే నాలుగు గోల్స్‌తో ఫర్వాలేదనిపించాడు. అయితే సర్కిల్ లోపల ఎక్కువ సేపు బంతిని ఉంచుకునే అతని బలహీనత కారణంగా ప్రత్యర్థులు సరైన డిఫెన్స్‌తో భారత్ మరిన్ని గోల్స్ చేయకుండా అడ్డుకోగలిగారు. ఇద్దరు గోల్ కీపర్లు కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా ఘోర వైఫల్యం శ్రీజేశ్ ఉన్నప్పుడు జట్టు గోల్‌కీపింగ్ స్థాయి ఎంత గొప్పగా ఉండేదో గుర్తు చేసింది.
మన్‌దీప్ సింగ్, లలిత్, సుఖ్‌జీత్, దిల్‌ప్రీత్ కూడా ప్రభావం చూపలేకపోయారు. 400కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు హార్దిక్ సింగ్ మాత్రమే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చినా అది జట్టు గెలిచేందుకు సరిపోలేదు. హర్మన్‌ప్రీత్ ఆడని మ్యాచ్‌లలో మన డ్రాగ్ ఫ్లికింగ్ మరీ పేలవంగా కనిపించింది. రోహిదాస్ అంచనాలను అందుకోలేకపోగా, జుగ్‌రాజ్ అయితే ఏకంగా పెనాల్టీ స్ట్రోక్‌ను కూడా గోల్‌గా మలచలేకపోయాడు. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీలో ఎంతో కీలకమైన డ్రాగ్‌ఫ్లికింగ్‌లో పరిస్థితి మెరుగు కాకపోయే ఎలాంటి విజయాలను ఆశించలేం. మరో రెండు నెలల్లో భారత్‌లోనే ఆసియా కప్ ఉంది. దీని ద్వారా మన టీమ్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.
అప్పటిలోగా జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా, సీనియర్లను పక్కన పెట్టిన కొత్తవారికి అవకాశాలు ఇస్తారా అనే విషయంపై కోచ్ స్పష్టతనివ్వలేదు. స్వదేశంలో జరిగే జూనియర్ వరల్డ్ కప్‌లో కుర్రాళ్ల ప్రదర్శన తర్వాత దీనిపై అతను నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అరైజిత్ సింగ్, మొహమ్మద్ రాహిల్, సెల్వమ్ కార్తీలాంటి యువ ఆటగాళ్లు ప్రస్తుతానికి తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 2023–24 ప్రొ లీగ్‌లో కూడా ఏడో స్థానంలో నిలిచిన టీమ్ ఆ తర్వాత కోలుకొని పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచే వరకు వెళ్లింది. ఇప్పుడు టీమ్‌కు అదే స్ఫూర్తి కావాలి.