వైభవ్‌ సరసన ప్రియాంశ్‌ | Priyansh Arya Joins Hands With Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సరసన ప్రియాంశ్‌

May 12 2026 12:31 PM | Updated on May 12 2026 12:35 PM

Priyansh Arya Joins Hands With Vaibhav Sooryavanshi

పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య ఐపీఎల్‌ కెరీర్‌లో మరో ప్రత్యేక రికార్డు సాధించాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (మే 11) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే హాఫ్ సెంచరీ బాది రికార్డుపుటల్లో చోటు దక్కించుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్‌ తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాడు. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాది ఖాతా ప్రారంభించాడు. ఆ తర్వాత ఏ బౌలర్‌నీ వదలకుండా కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌తో ప్రియాంశ్ పవర్‌ప్లేలో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ సరసన చేరాడు.  

ఐపీఎల్ పవర్‌ప్లేల్లో అత్యధిక 50+ స్కోర్లు (భారత ఆటగాళ్లు):
* వైభవ్ సూర్యవంశీ – 4
* ప్రియాంశ్ ఆర్య – 3

అలాగే ఐపీఎల్లో తొలి బంతికే (ఇన్నింగ్స్‌) అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి బంతికి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు:
* యశస్వి జైస్వాల్‌ – 4
* ప్రియాంశ్ ఆర్య – 3
విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్‌, సంజూ శాంసన్‌ తదితరులు తలో సారి ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్సర్లు కొట్టారు.

ఇదిలా ఉంటే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్‌ ఆర్య రికార్డు ఇన్నింగ్స్‌తో చెలరేగినా పంజాబ్‌ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. ప్రియాంశ్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (59 నాటౌట్‌) కూడా సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అక్షర్‌ పటేల్‌ (56), డేవిడ్‌ మిల్లర్‌ (51) అద్భుత అర్ద సెంచరీలతో ఢిల్లీని గెలిపించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement