ఒంటరిగా డగౌట్లో రిక్కీ పాంటింగ్‌.. ఫొటో వైరల్‌ | Ponting Left Alone On PBKS Bench After Defeat R Ashwin Heartbroken | Sakshi
Sakshi News home page

ఒంటరిగా డగౌట్లో రిక్కీ పాంటింగ్‌.. కోచ్‌ ఒక్కడినే వదిలేశారా?

May 18 2026 1:05 PM | Updated on May 18 2026 1:23 PM

Ponting Left Alone On PBKS Bench After Defeat R Ashwin Heartbroken

ఐపీఎల్‌-2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఆ తర్వాత డీలా పడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలై..  వరుసగా ఆరో పరాజయం నమోదు చేసింది. 

తద్వారా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక పంజాబ్‌ టాప్‌-4 చేరాలంటే మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌లో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

‘ప్లే ఆఫ్స్‌’లో ఆర్సీబీ
మరోవైపు.. ధర్మశాలలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్‌’కు దూసుకెళ్లింది. ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వెంకటేశ్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 73 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దేవదత్‌ పడిక్కల్‌ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (12 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు.

పంజాబ్‌ ఆరో‘సారీ’
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి అంచనాలు పెంచిన పంజాబ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.

శశాంక్‌ సింగ్‌ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించగా... కూపర్‌ కనోలి (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టొయినిస్‌ (25 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యాంశ్‌ షెడ్గే (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. 

ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (2)తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) విఫలమవడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. భువనేశ్వర్‌ 2 వికెట్లు పడగొట్టగా... రసిఖ్‌ సలామ్‌కు మూడు వికెట్లు దక్కాయి.  

 ఫొటో వైరల్‌
ఇక ఈ ఓటమితో పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపించింది. ఒంటరిగా.. డగౌట్లో ముందు కుర్చీపై తలవాల్చి ఉన్న పాంటింగ్‌ ఫొటో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

అశూ ఏమన్నాడంటే...
‘‘ఈరోజు టీవీలో ఓ శక్తిమంతమైన ఫొటో చూశాను. రిక్కీ పాంటింగ్‌ డగౌట్లో ఒక్కడే కూర్చుని కుర్చీ మీద ఒరిగిపోయాడు. తన మనసులో ఆందోళన చెలరేగుతూ ఉంటుంది.  ఆరంభంలో వాళ్లు టేబుల్‌ టాపర్‌గా ఉన్నారు. 

కానీ ఆ తర్వాత సీన్‌ మొత్తంగా మారిపోయింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో వరుసగా మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్‌..  సెకండ్‌ హోం గ్రౌండ్‌ ధర్మశాలలో మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.

చిన్న తప్పిదాల వల్ల కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రిక్కీ పాంటింగ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తీవ్రమైన బాధలో ఉండి ఉంటారు. నాకూ బాధగానే ఉంది. అయినా నిజాన్ని అంగీకరించకతప్పదు’’ అని అశూ పేర్కొన్నాడు. 

కాగా పంజాబ్‌ లీగ్‌ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మే 23న ఏకనా స్టేడియంలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది పాంటింగ్‌ మార్గనిర్దేశనం.. శ్రేయస్‌ సారథ్యంలో పంజాబ్‌ ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.

చదవండి: రిటైర్మెంట్‌పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని

Advertisement
 
Advertisement
Advertisement