
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ పోరులో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిన టైటాన్స్... తాజాగా యూపీ యోధాస్ చేతిలో కూడా పరాజయం పాలైంది.
శనివారం తెలుగు టైటాన్స్ 35–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పట్టికలో ఏడోస్థానానికి పరిమితమైన టైటాన్స్... ఈ సీజన్ ఆరంభంలో విశాఖ తీరంలో జరుగుతున్న మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది.
తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. చేతన్ సాహు 4, భరత్ 3 పాయింట్లు సాధించారు. విజయ్ ఈ సీజన్‌లో తొలి సూపర్–10 ఖాతాలో వేసుకున్నాడు.
యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 14 పాయింట్లతో విజృంభించగా... కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ (8 పాయింట్లు), గుమాన్ సింగ్ (7 పాయింట్లు) అతడికి అండగా నిలిచారు. యూ ముంబా, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ నిరీ్ణత సమయంలో 29–29 పాయింట్లతో ‘టై’కాగా... ఆ తర్వాత నిర్వహించిన సూపర్ రెయిడ్స్‌లో యూ ముంబా 6–5 పాయింట్ల తేడాతో గెలుపొందింది.
నిర్ణీత సమయంలో యూ ముంబా జట్టు తరఫున రోహిత్ రాఘవ్ 7, అజిత్ చౌహాన్ 6 పాయింట్లు సాధించారు.
గుజరాత్ టైటాన్స్ తరఫున హిమాన్షు సింగ్ 7 పాయింట్లు, రాకేశ్ 5 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూ ముంబా (రాత్రి 8 గంటలకు), బెంగాల్ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
చదవండి: KCL 2025: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. రెండు ఓవర్లలో 71 పరుగులు! వీడియో