#టీమిండియా; అలా టీ కోసమని వెళ్లొచ్చా... | Sakshi
Sakshi News home page

అలా టీ కోసమని వెళ్లొచ్చా, అంతా ఖతం!

Published Sat, Dec 19 2020 12:19 PM

Pink Ball Test: Twitter Reacts On Team Batting Collapse Against Australia - Sakshi

అడిలైడ్‌: పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా వైఫల్యంపై సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఇంత చెత్తగా టెస్టు క్రికెట్‌ ఆడతారని అనుకోలేదని అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పుజారా, రహానే, అశ్విన్‌, కోహ్లి కలిసి 4 పరుగులు చేయగా.. ఉమేశ్‌ ఒక్కడే నాలుగు పరుగులు చేశాడని, అంటే ఆ నలుగురిక కంటే అతనే మెరుగైన బ్యాట్స్‌మన్‌ అని ఫాన్స్‌ ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరేమో.. రహానే తొలి ఇన్నింగ్స్‌ తప్పిదాన్ని ఎత్తి చూపిస్తున్నారు.

రహానే కారణంగా కోహ్లి రనౌట్‌ కాకపోయుంటే భారత్‌కు కనీసం 200 పరుగుల ఆదిక్యం లభించేదని అంచనా వేస్తున్నారు. అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసిన ఆసీస్‌ బౌలర్లదే ఈ క్రికెట్‌ అంతా అని ప్రశంసిస్తున్నారు. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఎంత త్వరగా ఔటయ్యారో సూచించే మీమ్స్‌తో హల్‌ చల్‌ చేస్తున్నారు. ఇక మ్యాచ్ మొదలవగానే టీ కోసమని వెళ్లొచ్చేసరికి 9 వికెట్లు నేలకూలాయని తాజా టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న లక్కీ దిగ్భాంతి వ్యక్తం చేశాడు. అంతా కలగా ఉందని వ్యాఖ్యానించాడు.

ఇలా వచ్చి అలా..
తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆదిక్యం సాధించిన కోహ్లి సేన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. రెండో రోజు ఆట మరికాపేపట్లో ముగుస్తుందనగా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ ఆరు ఓవర్లు ఆడి 9 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా వికెట్‌ కోల్పోయింది. నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన బుమ్రా (0), మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (5) రెండో రోజు ఆట ముగించారు. అయితే, మూడో రోజు ఆట ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనే భారత జట్టు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ టీమిండియా వికెట్ల పతనాన్ని శాసించారు. రెండో వికెట్‌గా బుమ్రా (2) ఔటవడంతో అక్కడ నుంచి వికెట్లు పతనం పేకమేడను తలపించింది. అప్పటికి జట్టు స్కోరు 15 మాత్రమే.

అదే స్కోరు వద్ద మరో మూడు వికెట్లు కోల్పోవడం అత్యంత దారుణం. మొదటగా కీలక ఆటగాడు పుజారా డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ (9), రహానే (0) ఔటయ్యారు. కోహ్లి (4), సాహా (4), అశ్విన్‌ (0), హనుమ విహారి (8) అదే బాటలో నడిచారు. చివర్లో కమిన్స్‌ బంతి షమీ మోచేతికి బలంగా తాకడంతో అతను విలవిల్లాడాడు. జట్టు ఫిజయో పరీక్షించి షమీ బ్యాటింగ్‌ చేయలేడని చెప్పడంతో.. అతన్ని రిటైర్డ్‌ ఔట్‌గా అంపైర్లు ప్రకటించారు. దీంతో గతంలో ఉన్న తక్కువ పరుగుల రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లి సేన 36 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ముగించింది. ఫలితంగా 1974లో లార్డ్స్‌ టెస్టులో 42 పరుగులతో అత్యల్ప స్కోరు నమోదు కాగా.. తాజా టెస్టులో ఆ రికార్డు కనుమరుగైంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement