NZ VS ENG 2nd Test: ఇంగ్లండ్‌పై కివీస్‌ చారిత్రక విజయం.. బ్రిటిష్‌ మీడియా ఆశ్చర్యకర స్పందన

NZ 1 Run Margin Victory VS ENG In 2nd Test, Reactions From British Media - Sakshi

నరాలు తెగే ఉత్కంఠ నడుమ, నాటకీయ పద్ధతిలో చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌పై బ్రిటిష్‌ మీడియా ఆశ్చర్చకర రీతిలో స్పందించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పరుగు తేడాతో సంచలన విజయం సాధించి, అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ మీడియా ఆతిధ్య న్యూజిలాండ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూనే, బజ్‌ బాల్‌ ఫార్ములా అంటూ ఓవరాక్షన్‌ చేసి ఓటమిని కొని తెచ్చుకున్న ఇంగ్లండ్‌ను వెనకేసుకొచ్చింది. 

ఛేదనలో ఇంగ్లండ్‌ కుప్పకూలిన వైనాన్ని పక్కకు పెట్టిన అంగ్రేజ్‌ మీడియా.. ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో భాగమైనందుకు స్టోక్స్‌ సేనను ప్రశంసించింది. ప్రముఖ బ్రిటిష్‌ దినపత్రిక టెలిగ్రాఫ్‌, చరిత్రలో చిరకాలం​ నిలబడిపోయే ఈ మ్యాచ్‌పై స్పందిస్తూ.. ఇది న్యూజిలాండ్‌ విజయమో లేక ఇంగ్లండ్‌ ఓటమో కాదు.. ఈ విజయం మొత్తంగా టెస్ట్‌ క్రికెట్‌ది అంటూ కివీస్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ను దక్కనీయకుండా సైడ్‌లైన్‌ చేసింది. 

ఓవరాక్షన్‌ (తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి) చేసి ఓటమిపాలైనందుకు గాను సొంత జట్టును నిందించాల్సిన మీడియా.. ఏదో సాధించాం అన్నట్లు స్టోక్స్‌ సేనకు మద్దతుగా నిలవడంపై యావత్‌ క్రీడా ప్రపంచం ​అసహనం వ్యక్తం చేస్తుంది. ఇది చాలదన్నట్లు తమ జట్టే టెస్ట్‌ క్రికెట్‌ను కాపాడుతుందని ఇంగ్లిష్‌ మీడియా బిల్డప్‌ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టెస్ట్‌ క్రికెట్‌ను వినోదాత్మకంగా మార్చడమే లక్ష్యంగా ఇంగ్లండ్‌ జట్టు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే ఈ మ్యాచ్‌ జరిగిందని అక్కడి మీడియా డప్పు కొట్టుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూకే మీడియా నుంచి వచ్చిన ఈ అనూహ్య స్పందన చూసి నివ్వెరపోవడం క్రికెట్‌ అభిమానుల వంతైంది. 

కాగా, బజ్‌ బాల్‌ ఫార్ములా అంటూ విజయవంతంగా సాగుతున్న ఇంగ్లండ్‌ జైత్రయాత్రకు వెల్లింగ్టన్‌ టెస్ట్‌తో బ్రేకులు పడ్డాయి. టెస్ట్‌ క్రికెట్‌లో వేగం పెంచి మంచి ఫలితాలు రాబట్టిన ఇంగ్లీష్‌ జట్టుకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో అంతిమంగా న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుం‍ది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top