
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో అతను జట్టు మారతాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్‌కే సంజూను ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేస్తుందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ ప్రచారాల నడుమ సంజూకు సంబంధించిన మరో వార్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. సీఎస్‌కేకు చెందిన మాజీ ఆటగాడు ఎన్ జగదీసన్ కోసం సంజూను దులీప్ ట్రోఫీ (సౌత్ జోన్ జట్టు) కోసం ఎంపిక చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సౌత్ జోన్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ తైలవన్ సర్గునమ్ జేవియర్ పరోక్షంగా అంగీకరించారు.
దులీప్ ట్రోఫీ కోసం సంజూను ఎంపిక చేయకపోవడానికి గత సీజన్‌లో అతని గైర్హాజరీ ప్రధాన కారణమని ఆయన చెప్పారు. జట్టు ఎంపిక ఆటగాళ్ల గత సీజన్ ప్రదర్శన ఆధారంగా జరిగిందని తెలిపారు. సంజూతో పోలిస్తే జగదీసన్ గత సీజన్‌లో ఓ మోస్తరు మ్యాచ్‌లు ఆడాడు. అందులోనూ అతను పర్వాలేదనిపించాడు. అందుకే సంజూను కాకుండా అతన్ని ప్రిఫర్ చేశామని వివరణ ఇచ్చారు.
కాగా, గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి తప్పుకున్న తర్వాత సంజూను (కేరళ) వరుసగా రెండో దేశవాలీ టోర్నీ కోసం ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టులో ఏకంగా ఐదుగురు కేరళ ఆటగాళ్లను ఎంపిక చేసినా సంజూపై మాత్రం వేటు వేశారు.
ప్రస్తుతం సంజూ గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసే భారత టీ20 జట్టులో కూడా అతని స్థానం ప్రశ్నార్థకంగా మారింది. సంజూ దేశవాలీ క్రికెట్‌కు అందుబాటులో ఉండకపోవడాన్ని భారత సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని కారణంగా చూపి సంజూను జాతీయ జట్టు నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదు.
ఇదిలా ఉంటే, సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కేరళకు చెందిన మొహమ్మద్ అజహారుద్దీన్ వ్యవహరించనున్నాడు.
సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2025 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్) (హైదరాబాద్), మహ్మద్ అజహారుద్దీన్ (వైస్ కెప్టెన్) (కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పాండిచ్చేరి), సల్మాన్ నిజర్ (కేరళ), నారాయణ్ జగదీసన్ (తమిళనాడు), త్రిపురణ విజయ్ (ఆంధ్ర), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎండి (కేరళ), రికీ భుయ్ (ఆంధ్ర), బాసిల్ ఎన్‌పి (కేరళ), గుర్జప్‌నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతాంకర్ (గోవా)
స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అంకిత్ శర్మ (పాండిచ్చేరి), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్ర).