
న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరు భారీ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు... నిర్ణీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
సామ్ కరన్ (35 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అతడు రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో మొత్తం 19 పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. జోస్ బట్లర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, కైల్ జెమీసన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, బ్రాస్‌వెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు భారీ వర్షం ముంచెత్తింది. ఎంతసేపటికీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు పలుమార్లు పరీక్షించిన అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే రెండో టి20 జరగనుంది.