
బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ మీట్ నుంచి వైదొలిగిన నీరజ్ చోప్రా
డైమండ్ లీగ్ ఫైనల్, ప్రపంచ చాంపియన్‌షిప్‌పై దృష్టి
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ (డీఎల్) చివరి అంచె పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్... ప్రధాన టోర్నీకి ముందు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జరుగనున్న మీట్ నుంచి తప్పుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా... ఈ నెల 28న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వేదికగా జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్లో బరిలోకి దిగనున్నాడు.
ఒక సీజన్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో నాలుగు డైమండ్ లీగ్ అంచె పోటీలు జరగడం పరిపాటి కాగా... ఇందులో ప్రదర్శన ఆధారంగా అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈ సీజన్‌లో నీరజ్ చోప్రా రెండు పోటీల్లోనే పాల్గొన్నా... మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాడు. ఇటీవల సిలెసియా టోర్నీ నుంచి సైతం నీరజ్ తప్పుకున్నాడు. 27 ఏళ్ల నీరజ్ చోప్రా ఈ సీజన్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్నాడు. మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ అంచె పోటీల్లో నీరజ్ జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరాడు.
అనంతరం జూన్‌లో పారిస్ డైమండ్ లీగ్‌లో నీరజ్ జావెలిన్‌ను 88.16 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. శుక్రవారం జరగనున్న బ్రస్సెల్స్ అంచె పోటీల అనంతరం టాప్–6లో నిలిచిన త్రోయర్లు డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. జూలై 5న భారత్‌లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తర్వాత భారత స్టార్ తిరిగి బరిలోకి దిగలేదు. బెంగళూరు వేదికగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆ టోర్నీలో నీరజ్ జావెలిన్‌ను 86.18 మీటర్ల దూరం విసిరి టైటిల్ గెలుచుకున్నాడు.
ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఆరు పోటీల్లో పాల్గొన్న నీరజ్ అందులో నాలుగింట టైటిల్ సాధించడంతో పాటు మరో రెండు టోర్నీల్లో రెండో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ ఫైనల్ అనంతరం వచ్చే నెల 13 నుంచి 21 వరకు టోక్యో వేదికగా ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుండగా... అందులో నీరజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగనున్నాడు.
పెరిగిన ప్రైజ్‌మనీ...
అథ్లెటిక్స్‌లో డైమండ్ లీగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా 14 అంచెల పోటీలు నిర్వహించిన అనంతరం అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లను ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో మొత్తం 32 ఈవెంట్స్ జరుగుతాయి... వాటి విజేతలకు డైమండ్ ట్రోఫీతో పాటు... వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నేరుగా పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ లభిస్తుంది. ఈ నెల 28న జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్ జావెలిన్ త్రో పోటీల్లో విజేతగా నిలిచిన అథ్లెట్‌కు రూ. 26.11 లక్షల ప్రైజ్‌మనీ సైతం లభించనుంది.
ఈ ఏడాది పురుషుల 100 మీటర్ల పరుగు, 1500 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, పోల్‌వాల్ట్... మహిళల 100 మీటర్ల పరుగు, 100 మీటర్ల హర్డిల్స్, 3000 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్ల విజేతలకు మెరుగైన ప్రైజ్‌మనీ లభించనుంది. ఈ విభాగాల్లో విజేతగా నిలిచిన వారికి రూ. 43.52 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 17.40 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 8.70 లక్షలు దక్కనున్నాయి.