ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్- లక్నో సారథి రిషభ్ పంత్ (PC: DC)
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అక్షర్ పటేల్ సారథ్యంలో వరుస విజయాలతో ఆరంభంలో దుమ్ములేపిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ చేరుకుండానే నిష్క్రమించింది.
ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఎలాగైనా సత్తా చాటాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లో అక్షర్ సేన.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs DC)ను ఎదుర్కోనుంది. ఇక ఈసారి ఢిల్లీ ఓపెనింగ్ జోడీ మారనుంది.
కేఎల్ రాహుల్ జోడీ ఎవరు?
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అయితే, అతడికి జోడీ ఎవరన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘లక్నోతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించేదెవరు?
అభిషేక్ పోరెల్, పాతుమ్ నిస్సాంక లేదంటే పృథ్వీ షా?.. నేనైతే పృథ్వీ షాకే ఓటు వేస్తాను. నితీశ్ రాణా వన్‌డౌన్‌లో.. ఆ తర్వాతి స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (Axar Patel), డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ రావాలి.
ఎనిమిదో స్థానంలో సీమర్ రిజ్వీ లేదంటే విప్రాజ్ నిగమ్‌ను ఆడించవచ్చు. కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. ఒకవేళ మరో భారత బౌలర్‌ను ఆడించాలనుకుంటే టి.నటరాజన్ లేదంటే ఆకిబ్ నబీని తీసుకోవాలి. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఊహించని విధంగా..
కాగా గతంలో ఢిల్లీకి ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా లీగ్‌కు దూరమయ్యాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటి మినీ వేలంలో పేరు నమోదు చేసుకోగా ముందుగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.
అయితే, ఆఖరి నిమిషంలో రూ. 75 లక్షల కనీస ధరకు ఢిల్లీ తమ పాత ఆటగాడిని సొంతం చేసుకుంది. తుదిజట్టులో అతడికి చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఊహించని విధంగా ఓపెనర్‌గా స్థానం ఇవ్వడం గమనార్హం.
లక్నోతో మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న ఢిల్లీ తుదిజట్టు
కేఎల్ రాహుల్, పృథ్వీ షా, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ, సమీర్ రిజ్వి/విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, టి.నటరాజన్/ఆకిబ్ నబీ.


