
ధర్మశాల విమానాశ్రయం మూసివేత
ఇంకా చేరుకోని ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్ రెండో సొంత మైదానమైన ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత సైన్యం... పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాశ్రయాలను మూసి వేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై జట్టు ధర్మశాల చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ ముంబైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా... గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ యథావిథిగా జరగనుంది.
ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ‘బీసీసీఐ నుంచి కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో గురువారం మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశాం. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు వేదిక మార్పునకు సంబంధించిన బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఐపీఎల్ సాగడంపై ఎలాంటి అనుమానాలు లేవని... ప్రభుత్వ సూచనల మేరకు లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు.