Photo Courtesy: IPL 2026
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ది ఘన చరిత్ర. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం తిరోగమనం దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఆ జట్టు పూర్తిగా గాడి తప్పింది. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన మాజీ చాంపియన్స్ అవమానకర రీతిలో నిష్క్రమించింది.
ఆదివారం ఆర్సీబీతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజేతులా ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన దశలో అనుభవం లేని రాజ్‌బవా చేతికి బంతిని అందించి కెప్టెన్ సూర్యకుమార్ మూల్యం చెల్లించుకున్నాడు. అనుభవలేమితో ఒత్తిడికి లోనైన రాజ్‌బవా వైడ్లు, నోబ్ వేసి ముంబై ఓటమికి కారణమయ్యాడు.
ఈ ఓటమితో ముంబై 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించడంతో లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఉన్నప్పటికీ రెండు వారాల ముందే ముంబై ఐపీఎల్ 19వ సీజన్‌లో ఎలిమినేట్ అయింది. అయితే ఐపీఎల్‌కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యులుగా ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ సహా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా ముంబై జట్టులో ఉండడం గమనార్హం.
అయితే ఈ సీజన్‌లో ముంబై దారుణ వైఫల్యంతో వచ్చే సీజన్‌కు జట్టులో ప్రక్షాళన తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రం విడుదల చేయనుంది. వారే ప్రస్తుత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, ట్రెంట్ బౌల్ట్.
సూర్యకుమార్
35 ఏళ్ల వయసున్న సూర్యకుమార్ టీ20 క్రికెట్‌లో మిస్టర్ 360 ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. కేవలం టీ20 స్పెషలిస్ట్‌గానే టీమిండియాకు ఆడిన సూర్యకుమార్ గత నాలుగేళ్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్‌లాడి కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు.
ఇదే సీజన్‌లో రోహిత్ శర్మ గాయంతో చాలా మ్యాచ్‌లకు దూరం కావడంతో జట్టులో సీనియర్‌గా బ్యాటర్‌గా బాధ్యతగా ఆడాల్సిన సూర్యకుమార్ తన పాత్రకు న్యాయం చేయడంలో విఫలమయ్యాడు. పైగా పాండ్యా దూరమవ్వడంతో కెప్టెన్సీ బాధ్యతలు అతడిని మరింత ఒత్తిడిలోకి నెట్టేశాయి. దీంతో వచ్చే సీజన్‌లో సూర్యకు ముంబై టాటా చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా
ఒకప్పుడు ముంబై ఇండియన్స్‌లో ఆడిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత 2022 సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గుజరాత్ ఆడిన తొలి సీజన్‌లోనే పాండ్యా ఆ జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. మరుసటి సీజన్‌లోనూ గుజరాత్‌ను రన్నరప్‌గా నిలపడంతో పాండ్యా పేరు మార్మోగిపోయింది.
దీంతో ఉన్నపళంగా 2024సీజన్‌లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. కానీ ముంబైలోకి వచ్చినప్పటి నుంచి పాండ్యా అటు కెప్టెన్‌గా.. ఇటు ఆల్‌రౌండర్‌గా పూర్తిగా విఫలమవుతూ వచ్చాడు. 2025 సీజన్‌లో పాండ్యా సారథ్యంలో ముంబై ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఇతర జట్ల సమీకరణాల ఆధారంగా చేరడంతో ముంబై స్థాయికి ఇది తగదు. ఇక 2024 సీజన్‌తో పాటు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది.
ఈ సీజన్‌లో పాండ్యా 8 మ్యాచ్‌లాడి 146 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ విఫలమైన పాండ్యా కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీనికి తోడు తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. గాయంతో ఈ సీజన్‌కు దూరమైన పాండ్యా వచ్చే సీజన్‌లో వేరే జట్టుకు ఆడే అవకాశముంది.
ట్రెంట్ బౌల్ట్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ట్రెంట్ బౌల్ట్‌ను ముంబై ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్‌లో బౌల్ట్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లాడిన బౌల్ట్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.బుమ్రాతో కలిసి ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తాడనుకుంటే బౌల్ట్ మాత్రం తన దారుణ ప్రదర్శనతో ముంబై ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారాడు. వచ్చే సీజన్‌లో బౌల్ట్ స్థానంలో యంగ్ పేసర్‌ను తీసుకోవాలని ఇప్పటికే ముంబై భావిస్తోంది.


