నాన్న త్యాగం...ధోనిపై అభిమానం | Mukul Chaudharys cricket career is interesting | Sakshi
Sakshi News home page

నాన్న త్యాగం...ధోనిపై అభిమానం

Apr 11 2026 2:49 AM | Updated on Apr 11 2026 2:49 AM

Mukul Chaudharys cricket career is interesting

ఆసక్తికరం ముకుల్‌ చౌదరీ క్రికెట్‌ ప్రస్థానం 

రోజూ 100–150 సిక్సర్ల సాధన  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ ముకుల్‌ చౌదరీ గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లతో మోత మోగించి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ ఏడింటిలో తాను కొట్టిన మొదటి సిక్సర్‌ అన్నింటికంటే ఎక్కువగా నచ్చిందని ముకుల్‌ మ్యాచ్‌ తర్వాత చెప్పాడు. వైభవ్‌ అరోరా వేసిన 17వ ఓవర్‌లో ఈ సిక్స్‌ వచ్చింది. అరోరా వేసిన యార్కర్‌ను హెలికాప్టర్‌ షాట్‌తో లాంగాన్‌ మీదుగా సిక్స్‌ బాదిన ముకుల్‌ తాను ఆరాధించే ధోనిని గుర్తుకు తెచ్చాడు. ధోనిపై ఇష్టంతో క్రికెట్‌లోకి వచ్చిన ముకుల్‌ ఇప్పుడు ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయాడు.   – సాక్షి క్రీడా విభాగం

రాజస్తాన్‌కు చెందిన ముకుల్‌ ఐపీఎల్‌లో తన తొలి సీజన్‌ ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 14 పరుగులకే పరిమితమైన అతను రెండో మ్యాచ్‌లో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆడిన ఐదు బంతుల్లోనూ అతను కాస్త తడబడ్డాడు. అయితే ఎక్కువగా ఆందోళన చెందవద్దని, నచ్చినట్లుగా ఆడమని కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ ధైర్యాన్నందించాడు. దాంతో కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ముకుల్‌ అన్నాడు. 

‘ఐదు మ్యాచ్‌లు ఆడినా 50 మ్యాచ్‌లు ఆడినా ఎవరిపైనైనా ఒత్తిడి సహజం. అందులోనూ నేను తొలిసారి ఐపీఎల్‌లో ఆడుతున్నాను. కాబట్టి జట్టు మనపై నమ్మకం ఉంచినప్పుడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో కూడా ఒత్తిడి ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో కూడా మంచి ప్రదర్శన తర్వాతే ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఇక్కడ బాగా ఆడినప్పుడు వచ్చే గుర్తింపు, పేరు ఎంతో భిన్నం. బయటి అంశాల గురించి పట్టించుకోకుండా మనపై మనం నమ్మకం ఉంచి ఆడటం ముఖ్యం’ అని ముకుల్‌ వ్యాఖ్యానించాడు.  

ఆ షాట్‌ అంటే ఇష్టం... 
అరోరా బౌలింగ్‌లో ముకుల్‌ కొట్టిన హెలికాప్టర్‌ షాట్‌పై అన్ని వైపుల నుంచి నుంచి ప్రశంసలు కురిశాయి. ‘మొదటి నుంచి నేను ధోనికి వీరాభిమానిని.  వికెట్‌ కీపర్‌ అయిన నేను ధోనిలాగే ఏడో స్థానంలో ఆడుతున్నా. ఆయన మ్యాచ్‌లను ముగించే తీరు నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచే హెలికాప్టర్‌ షాట్‌ను ఎంతో ప్రాక్టీస్‌ చేశాను. ఆ షాట్‌ నాకు చాలా నచ్చేది. యార్కర్‌ను ధోని సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని సిక్స్‌ కొట్టడం అంటే బౌలర్‌పై మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తుంది. భారీ షాట్‌లు కొట్టే విధంగా బలమైన శరీర నిర్మాణం నాకుంది. నేను సాధన కూడా చాలా చేస్తాను. ప్రతీ రోజూ దాదాపు 100–150 సిక్సర్లు ప్రాక్టీస్‌ చేస్తా. గత ఐదారు నెలలుగా ఇదే తరహాలో ఆడటం ఇప్పుడు ఫలితం చూపించింది’ అని 21 ఏళ్ల ముకుల్‌ వివరించాడు.  

దేశవాళీలో చెలరేగి... 
నాలుగు నెలల క్రితం సరిగ్గా ఇదే తరహా ఆటతో ముకుల్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీలో దృష్టిలో పడ్డాడు. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అప్పటికే సత్తా చాటిన ముకుల్‌ ఢిల్లీతో జరిగిన పోరులో మరింతగా చెలరేగాడు. ఐపీఎల్‌లో గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లాగానే రాజస్తాన్‌ 176 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ముకుల్‌ 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేసి చివరి బంతికి సిక్స్‌తో జట్టును గెలిపించాడు. ఆయుశ్‌ బదోని వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన 25 పరుగులను అతను రాబట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌ తర్వాతే వేలంలో లక్నో రూ.2 కోట్ల 60 లక్షలకు తీసుకుంది. గతంలో ఈ ఫీట్‌ నమోదు చేసిన కారణంగానే తనపై తనకు నమ్మకం ఉందని, ఇప్పుడు దానిని పునరావృతం చేశానని అతను చెప్పాడు.  

లాంగర్‌ ప్రోత్సాహంతో... 
ఐపీఎల్‌లో లక్నో జట్టుకు ఎంపికైన తర్వాత టీమ్‌ హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఈ కుర్రాడిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. తన బ్యాటింగ్‌పై నమ్మకంతో పాటు భారీ సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం కోచ్‌ను ఆకట్టుకున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో ‘అత్యంత ప్రమాదకర’ మిడిలార్డర్‌ బ్యాటర్‌గా ముకుల్‌ను తీర్చిదిద్దుతానని చెప్పి కోచ్‌ ప్రోత్సాహాన్నందించాడు. ‘అంత పెద్ద కోచ్‌ నా గురించి ఇలా మాట్లాడాడంటే నాలో ఏదో ప్రత్యేకత ఆయనకు కనిపించి ఉండవచ్చు. ప్రతీ రోజూ 15 నిమిషాల పాటు నా కోసం ప్రత్యేకంగా కేటాయించి సాధన చేయించడమే కాకుండా నేను ఆడాల్సిన ఆట శైలి గురించి వివరించేవారు. 

ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెలరేగాలని నేనూ గట్టిగా కోరుకున్నా. ఇప్పుడు నా ఆటను చూపించాను’ అని ముకుల్‌ వెల్లడించాడు. రెండేళ్ల క్రితం బ్యాటింగ్‌ చేసేటప్పుడు చాలా తొందరపాటు ప్రదర్శించే వాడినని... అయితే సాధన తర్వాత చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను గెలిపించాలనే పట్టుదల తనలో పెరిగిందని ముకుల్‌ గుర్తు చేసుకున్నాడు. కోల్‌కతాతో పోరులో బౌలర్‌ ఏదో ఒక దశలో తప్పు చేస్తాడనే నమ్మకంతోనే వేచి చూశానని చెప్పాడు. తన ఈ ప్రదర్శనను తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అతను చెప్పాడు.

కుటుంబ త్యాగాలతో... 
ముకుల్‌ తండ్రి దలీప్‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఆయన తన పెళ్లి కూడా కాకముందే కొడుకు పుడితే క్రికెటర్‌ను చేయాలని నిర్ణయించుకున్నాడు. ముకుల్‌ను 10 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి తీసుకొచ్చిన సమయంలో తండ్రి ఆరి్థక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కొడుకు శిక్షణలో అండగా నిలిచేందుకు ముందుగా ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశాడు. తనకు వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసి ముకుల్‌ శిక్షణ కోసం వెచ్చించాడు. 

రాజస్తాన్‌లోని స్వస్థలం ఝన్‌ఝునులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో జైపూర్‌లోని ఆరావళి అకాడమీలో చేరి్పంచాడు. ఆరంభంలో మీడియం పేసర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్‌ కీపర్లు ఎవరూ లేకపోవడంతో అవకాశాల కోసం అటువైపు మళ్లాడు. అయితే భారీ షాట్లు ఆడే ముకుల్‌ శైలిని గుర్తించిన కోచ్‌లు ఆ దిశగా బ్యాటింగ్‌లో ప్రోత్సహించారు. ఆరంభంలో సరైన అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత అతని ఆట పదునెక్కింది. 

బీసీసీఐ అండర్‌–23 టోర్నీలో రాజస్తాన్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్‌ దూసుకుపోయింది. టి20ల్లో మారిన పవర్‌ హిట్టింగ్‌ను మరింత సాధన చేసేందుకు వీలుగా మధ్యలో కొన్ని నెలల పాటు అతను ఢిల్లీలోని గుర్గావ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అతని కఠోర శ్రమ, పట్టుదల ఇప్పుడు ఐపీఎల్‌లో ఫలితం చూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement