Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లివే: సిరాజ్‌ భావోద్వేగం

Mohammed Siraj Emotional Note For Virat Kohli Always Be My Captain - Sakshi

Virat Kohli Quit Test Captaincy- Siraj Emotional Comments:‘‘నా సూపర్‌ హీరో.... నాకు మద్దతుగా నిలిచినందుకు.. నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించినందుకు మాత్రమే నీకు రుణపడి ఉంటానని చెబితే సరిపోదు... ఎందుకంటే నువ్వు నాకు అంతకుమించి.. నా పెద్దన్నవు... నా సోదరుడివి. నాపై నమ్మకం ఉంచి కెరీర్‌లో ఎదిగేలా ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు. నేను డీలా పడిపోయిన స్థితిలోనూ నాలోని గొప్ప ఆటగాడిని చూడగలిగినందుకు థాంక్యూ. నువ్వెప్పుడూ నా కెప్టెన్‌ కింగ్‌ కోహ్లివే’’ అంటూ టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్..  విరాట్‌ కోహ్లికి భావోద్వేగ లేఖ రాశాడు. 

కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ పరాజయం తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇకపై ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ తన కెప్టెన్‌ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టా వేదికగా కోహ్లి భయ్యాతో దిగిన ఫొటోలను షేర్‌ చేసి.... అక్షరాల రూపంలో అతడి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 

ఇక ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్‌ను ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి ప్రోత్సహించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు ఈ హైదరాబాదీ విఫలమైనా అతడికి మరోసారి అవకాశం ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టాడు. తద్వారా జట్టుకు, వ్యక్తిగతంగా సిరాజ్‌కు ప్రయోజనం చేకూరేలా చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ సిరాజ్‌పై నమ్మకం ఉంచి అతడికి మద్దతుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ ఈ మేరకు కోహ్లిని తన సోదరుడిగా భావిస్తున్నాననంటూ ఉద్వేగభరిత లేఖ రాయడం గమనార్హం.

చదవండి: Virat Kohli: అప్పుడు ‘కెప్టెన్‌’కు ఏడాదికి 180 కోట్లు.. ఒక్కో పోస్టుకు 5 కోట్లు.. మరి ఇప్పుడు అంతే సంపాదనా?!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top