Glenn Maxwell: రీ ఎంట్రీలో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్‌.. ఖుషీలో ఆర్సీబీ ఫ్యాన్స్‌

Maxwell blasts 61 in successful return from broken leg - Sakshi

కాలి ఫ్రాక్చర్‌ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌-2022 నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌంండర్‌, ఐపీఎల్‌లో ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. దాదాపు నాలుగు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. మార్ష్‌ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో విక్టోరియా జట్టు తరఫున బరిలోకి దిగిన మ్యాక్సీ.. 5 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. మ్యాక్సీ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా ప్రత్యర్ధి నిర్ధేశించిన 215 పరుగుల టార్గెట్‌ను విక్టోరియా విజయవంతంగా ఛేదించగలిగి, 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తన జట్టు 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బరిలోకి దిగి మ్యాక్సీ గ్రౌండ్‌ నలుమూలలా యదేచ్ఛగా షాట్లు ఆడి అదరగొట్టాడు. ఇది తెలిసి ఆర్సీబీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ విధ్వంసకర ఆటగాడు తిరిగి గాడిలో పడినందుకు వారు ఖుషీగా ఉన్నారు. ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించిన మరుసటి రోజే తమ స్టార్‌ ఆటగాడు మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఉబ్బితబ్బిబైపోతున్నారు.

కాగా, రీఎంట్రీలో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన మ్యాక్స్‌వెల్‌.. బౌలింగ్‌ చేయలేదు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే మాక్సీ తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న ఆసీస్‌ జట్టుతో (వన్డే) మ్యాక్సీ కలవాలంటే.. త్వరలో జరిగే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ను క్లియర్‌ చేయడం తప్పనిసరి అని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు చెందిన కీలక అధికారి తెలిపారు. 

ఇదిలా ఉంటే, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందు​కు ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందగా.. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ నువ్వా-నేనా అ‍న్నట్లుగా సాగుతుంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 263 పరుగులు చేస్తే.. భారత్‌ 262 పరుగులకు ఆలౌటైంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను.. అక్షర్‌ పటేల్‌ (74), కోహ్లి (44), రోహిత్‌ (32), జడేజా (26) ఆదుకున్నారు. వీరిలో ముఖ్యంగా అశ్విన్‌-అక్షర్‌ జోడీ 100కి పైగా పరుగుల జోడించి ఆవిరైపోయిన టీమిండియా ఆశలకు జీవం పోసింది. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌ 5 వికెట్లు పడగొట్టగా.. కున్నేమన్‌, మర్ఫీ తలో రెండు వికెట్లు, కమిన్స్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top