Max Verstappen: ఎఫ్‌1లో సంచలనం.. తొలిసారి చాంపియన్‌గా..

Max Verstappen wins Abu Dhabi GrandPrix, beats Lewis Hamilton - Sakshi

విశ్వవిజేతగా రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌

అబుదాబి గ్రాండ్‌ప్రిలో చివరి ల్యాప్‌లో విజయం

ఏడుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ హామిల్టన్‌కు నిరాశ

తుది ఫలితంపై మెర్సిడెస్‌ జట్టు ఫిర్యాదును తోసిపుచ్చిన స్టీవర్డ్స్‌

Max Verstappen wins Abu Dhabi Grand Prix, beats Lewis Hamilton: గత నాలుగు సీజన్‌లలో ఎదురులేని మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఆధిపత్యానికి గండికొడుతూ ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్‌ అవతరించాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నాటకీయ పరిణామాల మధ్య విజేతగా నిలిచాడు.

తొలిసారి ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు. రేసు చివరి వరకు ఆధిక్యంలో ఉన్న మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌ ఆఖరి ల్యాప్‌లో వెనుకబడిపోయి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో ఏడు ప్రపంచ టైటిల్స్‌ తో జర్మనీ దిగ్గజ రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన హామిల్టన్‌ మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు.   

అబుదాబి: ప్రతిభకు కాస్త అదృష్టం కూడా తోడైతే... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే... ఇక ఓటమి ఖాయమనుకున్న చోట కూడా పుంజుకొని అనూహ్య విజయం సాధించవచ్చని ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నిరూపించాడు. బ్లాక్‌ బాస్టర్‌ సినిమాను తలపించిన 2021 ఎఫ్‌1 సీజన్‌ వివాదాస్పదంగా ముగిసింది.

డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ను తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రిలో 58 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ (నెదర్లాండ్స్‌) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 57వ ల్యాప్‌ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్‌లో వెనుకబడిన హామిల్టన్‌ (బ్రిటన్‌) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.  

హామిల్టన్‌ కొంపముంచిన సేఫ్టీ కార్‌...
రెండో స్థానం నుంచి రేసును మొదలు పెట్టిన హామిల్టన్‌ తొలి మలుపులోనే వెర్‌స్టాపెన్‌ను అధిగమించి రేసులో ఆధిక్యంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి అద్భుతంగా డ్రైవ్‌ చేసిన హామిల్టన్‌ వెర్‌స్టాపెన్‌కు అందకుండా దూసుకెళ్లాడు. ల్యాప్‌ ల్యాప్‌నకు రెండో స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌తో అంతరాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇక ఎనిమిదో డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ ఖాయం అనుకున్న తరుణంలో ‘సేఫ్టీ కార్‌’ ట్విస్ట్‌ హామిల్టన్‌ ఆశలపై నీళ్లు చల్లింది. 53వ ల్యాప్‌లో విలియమ్స్‌ డ్రైవర్‌ నికోలస్‌ లతీఫీ కారు ప్రమాదానికి గురికావడంతో రేసు స్టీవర్డ్స్‌ సేఫ్టీ కారును ట్రాక్‌ మీదకు పంపారు.

ఇదే సమయంలో పిట్‌లోకి వచ్చిన వెర్‌స్టాపెన్‌ టైర్లను మార్చుకొని మళ్లీ ట్రాక్‌పై హామిల్టన్‌ వెనకగా రెండో స్థానంలో నిలిచాడు. 53వ ల్యాప్‌ ముందు వరకు హామిల్టన్, వెర్‌స్టాపెన్‌ మధ్య 11 ఉన్న సెకన్ల గ్యాప్‌ .... 57వ ల్యాప్‌లో సెకను కంటే తక్కువకు తగ్గింది. చివరి ల్యాప్‌లో రేసు మరోసారి ఆరంభం కాగా... రెండో స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌ తన కారుకు ఉన్న కొత్త టైర్ల సాయంతో ఐదో మలుపు వద్ద హామిల్టన్‌ను అధిగమించి విజేతగా నిలవడంతో పాటు డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

మెర్సిడెస్‌ నిరసన...
రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్‌ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్‌ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా వెర్‌స్టాపెన్‌ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్టీవర్డ్స్‌కు మెర్సిడెస్‌ ఫిర్యాదు కూడా చేసింది. 53వ ల్యాప్‌లో సేఫ్టీ కారు ట్రాక్‌పైకి రాగా... ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలుత ల్యాప్డ్‌ (ఒక ల్యాప్‌ తక్కువగా పూర్తి చేసిన కార్లు) కార్లు అన్‌ల్యాప్‌ కాకూడదంటూ ఆదేశాలు జారీ చేసి... అనంతరం అన్‌ల్యాప్‌ చేయొచ్చుంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

దాంతో హామిల్టన్, వెర్‌స్టాపెన్‌ మధ్య ఉన్న ఐదు ల్యాప్డ్‌ కార్లు హామిల్టన్‌ను దాటుకుంటూ వెళ్లాయి. అదే సమయంలో సేఫ్టీ కార్‌ పిట్‌లోకి వెళ్లి రేసును మళ్లీ ఆరంభించాలంటూ ఆజ్ఞలు జారీ చేసింది. ఇక్కడే వివాదం మొదలైంది. సేఫ్టీ కారు వచ్చే సమయానికి మొత్తం ఎనిమిది ల్యాప్డ్‌ కార్లు ట్రాక్‌పై ఉన్నాయి. కేవలం ఐదు కార్లకు మాత్రమే అన్‌ల్యాప్‌ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించి మిగిలిన మూడు కార్లకు ఎందుకు కల్పించలేదంటూ మెర్సిడెస్‌ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ల్యాప్డ్‌ కార్లు అన్‌ల్యాప్‌ అయితే తాము వెనుకబడి ఉన్న ల్యాప్‌ను పూర్తి చేసుకొని మళ్లీ మిగతా కార్ల వెనుక చేరే వరకు కూడా సేఫ్టీ కార్‌ పిట్‌లోకి వెళ్లరాదు. అయితే ఇక్కడ దానిని సేఫ్టీ కారు పాటించలేదు. అయితే తీవ్ర చర్చల అనంతరం మెర్సిడెస్‌ ఫిర్యాదును స్టీవర్డ్స్‌ తోసిపుచ్చి వెర్‌స్టాపెన్‌ను విజేతగా ప్రకటించారు.

వరుసగా ఎనిమిదోసారి...
ఎఫ్‌1 కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్‌ జట్టు వరుసగా ఎనిమిదో ఏడాది విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో మొత్తం 9 రేసుల్లో గెలిచిన మెర్సిడెస్‌ 613.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది.

ఎఫ్‌1కు కిమీ రైకొనెన్‌ గుడ్‌బై
అబుదాబి గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌కు ఫిన్లాండ్‌ డ్రైవర్‌ కిమీ రైకొనెన్‌ గుడ్‌బై చెప్పాడు. 2001లో సాబర్‌ జట్టు ద్వారా ఎఫ్‌1లో అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రైకొనెన్‌... మెక్‌లారెన్, ఫెరారీ, లోటస్, ఆల్ఫా రొమెయో జట్ల తరఫున రేసింగ్‌లో పాల్గొన్నాడు. ఫెరారీ డ్రైవర్‌గా 2007లో డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నెగ్గాడు.

ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌ గెలిచిన రేసుల సంఖ్య. మొత్తం 22 రేసులు జరగ్గా... హామిల్టన్‌ ఎనిమిది రేసుల్లో నెగ్గాడు. పెరెజ్‌ (రెడ్‌బుల్‌), ఒకాన్‌ (అల్పైన్‌ రెనౌ), రికియార్డో (మెక్‌లారెన్‌), బొటాస్‌ (మెర్సిడెస్‌) ఒక్కో రేసులో గెలిచారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top