పాక్‌లో క్రికెటర్ల చేతికి తుపాకులు | Marnus Labuschagne, Other Foreign Players Handed Guns In Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో క్రికెటర్ల చేతికి తుపాకులు

Apr 15 2026 11:52 AM | Updated on Apr 15 2026 11:54 AM

Marnus Labuschagne, Other Foreign Players Handed Guns In Pakistan

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కొత్తగా చేరిన హైదరాబాద్‌ కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ తమ విదేశీ ఆటగాళ్ల చేతికి తుపాకులను ఇచ్చింది. పాక్‌ ఆర్మీతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇది జరిగింది. సింధ్‌ పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కింగ్స్‌మెన్‌ కెప్టెన్‌ మార్నస్‌ లబూషేన్‌, రిలే మెరిడిత్‌ (ఆస్ట్రేలియా), స్థానిక ఆటగాళ్లు ఫఖర్‌ జమాన్‌, నసీమ్‌ షా, మహ్మద్‌ రిజ్వాన్‌ తుపాకులతో ఫైరింగ్‌ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

నిపుణుల పర్యవేక్షణలో లాబుషేన్‌ మెషీన్‌ గన్‌తో, మెరిడిత్‌ పిస్టల్‌తో రేంజ్‌ షూటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా లాబుషేన్‌ హైదరాబాద్‌ ఆటగాళ్ల సంతకాలతో ఉన్న ప్రత్యేక బ్యాట్‌ను సింధ్‌ డీఐజీ డాక్టర్‌ మక్సూద్‌ అహ్మద్‌కు అందజేశారు. పాకిస్తాన్‌లో క్రికెటర్లకు గతంలో కూడా ఆర్మీతో ఫిజికల్‌, మెంటల్‌ ట్రైనింగ్‌ ఇప్పించారు.  

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌తోనే పీఎస్‌ఎల్‌ అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌ ఫ్రాంచైజీ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇన్ని పరాజయాలు ఎదురైనా కింగ్స్‌మెన్‌కు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇంకా ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ జట్టులో లబూషేన్‌, కుసాల్‌ పెరీరా, మెరిడిత్‌, తీక్షణ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉండగా.. సైమ్‌ అయూబ్‌, ఉస్మాన్‌ ఖాన్‌ లాంటి స్థానిక స్టార్లు ఉన్నారు. కింగ్స్‌మెన్‌ ఏప్రిల్‌ 16న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రావల్పిండ్జ్‌తో తలపడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement