‘సిగ్గుచేటు.. ఇలాంటిదెన్నడూ చూడలేదు’ | Marnus Labuschagne Comment Shames PSL Over Pink Ball Drama | Sakshi
Sakshi News home page

PSL 2026: ‘సిగ్గుచేటు.. ఇలాంటిదెన్నడూ చూడలేదు’

Mar 27 2026 9:27 AM | Updated on Mar 27 2026 12:20 PM

Marnus Labuschagne Comment Shames PSL Over Pink Ball Drama

పాకిస్థాన్ సూప‌ర్‌లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్ తొలిరోజే బంతి విష‌యంలో వివాదం చోటుచేసుకుంది. లాహోర్ వేదిక‌గా లాహోర్ ఖ‌లంద‌ర్స్‌, హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో తెలుపు రంగు బంతి కాస్తా ఉదారంగులోకి మారిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.  

అయితే ఇక‌ బంతి ఇలా వేరే రంగులోకి మారిపోవ‌డం త‌న క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివ‌ర‌కు ఎప్పుడు చూడ‌లేదంటూ హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ మార్న‌స్ ల‌బుషేన్ పేర్కొన్నాడు. ల‌బుషేన్ మాట్లాడుతూ.. 'నిజానికి రెండో ఓవ‌ర్‌లోనే బంతి రంగు మార‌డాన్ని గ‌మ‌నించాను. ఇదే విష‌య‌మై అంపైర్ల దృష్టికి కూడా తీసుకెళ్లాను. 

అస‌లు ఏం జ‌రుగుతోంది? బంతి రంగు ఎందుకు మారుతోందంటూ అంపైర్ల‌ను అడిగాను. అయితే బంతి దుస్తుల‌కు అదే ప‌నిగా రాయ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని అనుకుంటున్నా. కానీ నా కెరీర్‌లో ఇలాంటి ఘ‌ట‌న మాత్రం ఎన్న‌డూ చూడ‌లేదు. అయితే బ్యాట్‌పై ఉన్న ఏదైనా స్టిక్క‌ర్‌పై బంతి ప‌డి అది దానికి అతుక్కుపోవ‌డం వ‌ల్ల బంతి రంగు మార‌డం చూశాను.

కానీ దుస్తుల‌కు బంతిని ప‌దే ప‌దే రుద్ద‌డం ద్వారా వేరే రంగులోకి మార‌డం మాత్రం అరుదైన విష‌య‌మని చెప్పొచ్చు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా లీగ్ నిర్వాహ‌కులు జాగ్ర‌త్త ప‌డ‌తార‌ని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.  అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌ తమ ‘ఎక్స్‌’ వేదికగా..‘ తొలి పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన లాహోర్‌ ఖలందర్స్‌కు మా అభినందనలు’ అంటూ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. 

ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖ‌లంద‌ర్స్ 69 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖ‌లంద‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (53) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, హ‌సీబుల్లా ఖాన్ (40 నాటౌట్‌) చివ‌ర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  హైదరాబాద్ కింగ్స్ బౌల‌ర్ల‌లో రిలే మెరిడిత్‌, హ‌స‌న్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవ‌ర్ల‌లో 130 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కెప్టెన్ ల‌బుషేన్ (26) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. లాహోర్ ఖ‌లంద‌ర్స్ బౌల‌ర్ల‌లో హారిస్ ర‌వూఫ్‌, సికంద‌ర్ ర‌జా, ఉబైద్ షా త‌లా రెండు వికెట్లు తీశారు. నేడు జ‌ర‌గనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేట‌ర్స్‌, క‌రాచీ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!

Advertisement
 
Advertisement
Advertisement