నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
లక్నో: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గతేడాది ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన ఈ రెండు జట్లు బుధవారం తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో పేపర్‌పై భీకరంగా కనిపిస్తోంది. మార్‡్ష, మార్క్‌రమ్ ఓపెనింగ్ చేయనుండగా... పంత్, పూరన్, బదోనీ, షహబాజ్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్నారు.
గత సీజన్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి కీలకం కానుండగా... పేస్ బౌలింగ్‌లో షమీ, నోర్జే, అవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ రూపంలో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మరోవైపు అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు కూర్పును సరిచేసుకునే పనిలో ఉంది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేదెవరో చూడాలి.
మిల్లర్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మతో బ్యాటింగ్ బలంగానే ఉండగా... ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దేశవాళీల్లో దుమ్మురేపుతున్న అఖీబ్ నబీపై అందరి దృష్టి నిలవనుంది. అక్షర్, కుల్దీప్ స్పిన్ భారం మోయనున్నారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా... అందులో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు నెగ్గగా... లక్నో మూడింట విజయం సాధించింది.


