సన్‌ రైజ్‌ కాలేదు | Lucknow defeated Sunrisers Hyderabad by 5 wickets | Sakshi
Sakshi News home page

సన్‌ రైజ్‌ కాలేదు

Apr 6 2026 3:53 AM | Updated on Apr 6 2026 3:53 AM

Lucknow defeated Sunrisers Hyderabad by 5 wickets

సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్‌

నితీశ్‌ రెడ్డి, క్లాసెన్‌ అర్ధ సెంచరీలు 

ఐదు వికెట్ల తేడాతో లక్నో విజయం

గెలిపించిన షమీ, పంత్‌  

సొంత మైదానంలో తొలి పోరు... మధ్యాహ్నం మ్యాచ్‌... బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌... టాస్‌ ఓడినా ముందుగా బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కింది. అయినా సరే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 156 పరుగులకే పరిమితమైంది. 26 పరుగులకే 4 వికెట్లు పడినా... నితీశ్‌ రెడ్డి, క్లాసెన్‌ మెరుపులతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా తడబడినా కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ముందుండి జట్టును గెలుపు తీరం చేర్చాడు. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను దూకుడుగా వెళ్లకుండా పరిస్థితికి తగినట్లుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.  

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ గెలుపు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన పోరులో లక్నో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కిది రెండో పరాజయం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 

హెన్రిచ్‌ క్లాసెన్‌ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33 బంతుల్లో 56; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 63 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో ఐదో వికెట్‌కు సన్‌రైజర్స్‌ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది. 

కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (50 బంతుల్లో 68 నాటౌట్‌; 9 ఫోర్లు), మార్క్‌రమ్‌ (27 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌కు కళ్లెం వేసిన లక్నో పేసర్‌ షమీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. సన్‌రైజర్స్‌ తదుపరి పోరులో ఈనెల 11న న్యూచంఢీగడ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడుతుంది.  

మెరుపు భాగస్వామ్యం... 
వరుసగా వికెట్లు కోల్పోవడంతో కాస్త జాగ్రత్త పడుతూ క్లాసెన్, నితీశ్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడారు. తొలి 13 బంతుల్లో క్లాసెన్‌ 8 పరుగులే చేయగా, నితీశ్‌ 13 బంతుల్లో 4 పరుగులే చేశాడు. అయితే ప్రిన్స్‌ వేసిన 11వ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్‌ కొట్టడంతో జోరు మొదలైంది. 19 పరుగుల వద్ద ముకుల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన క్లాసెన్‌ ఆ తర్వాత అవేశ్‌ ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. 

ఈ క్రమంలో ముందుగా క్లాసెన్‌ 33 బంతుల్లో, నితీశ్‌ 30 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే మరింత వేగంగా ఆడే క్రమంలో 2 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరగ్గా... మరో 12 పరుగులు జోడించి రైజర్స్‌ తర్వాతి 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరి 4 ఓవర్లలో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 33 పరుగులే చేయగలిగింది.  

రాణించిన మార్క్‌రమ్‌... 
ఓపెనర్‌గా చేసిన ప్రయత్నాన్ని లక్నో సారథి పంత్‌ ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేశాడు. దాంతో మిచెల్‌ మార్ష్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), మార్క్‌రమ్‌ లక్నో ఛేజింగ్‌ను ప్రారంభించారు. మార్ష్ తొందరగానే అవుటైనా, మార్క్‌రమ్‌ ధాటిని ప్రదర్శించాడు. ఉనాద్కట్‌ ఓవర్లో అతను 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడంతో లక్నో పవర్‌ప్లేలో స్కోరు 53 పరుగులకు చేరింది. మరోవైపు పంత్‌ మాత్రం దూకుడుకు పోకుండా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేశాడు. 

అయితే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడు పరుగుల వ్యవధిలో బదోని (9 బంతుల్లో 12; 1 ఫోర్‌), నికోలస్‌ పూరన్‌ (1)లను అవుట్‌ చేయడంతో పాటు పరుగుల వేగాన్ని అడ్డుకొని రైజర్స్‌ పైచేయి సాధించే ప్రయత్నం చేసింది. ఈ దశలో పంత్‌కు అబ్దుల్‌ సమద్‌ (12 బంతుల్లో 16; 2 ఫోర్లు) కొద్దిసేపు అండగా నిలిచాడు. 43 బంతుల్లో పంత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది.  

చివర్లో ఉత్కంఠ... 
లక్నో విజయానికి చివరి 18 బంతుల్లో 19 పరుగులు కావాలి. దూబే 6 పరుగులే ఇచ్చి సమద్‌ను అవుట్‌ చేయగా, 19వ ఓవర్లో హర్షల్‌ 4 పరుగులే ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఉనాద్కట్‌ వేసిన తొలి రెండు బంతులను ఫోర్‌లుగా మలచిన పంత్‌ తర్వాతి రెండు బంతుల్లో పరుగు తీయలేకపోయాడు. అయితే ఐదో బంతిని మళ్లీ బౌండరీకి తరలించి విజయాన్ని ఖాయం చేశాడు.

షమీ సూపర్‌... 
సీనియర్‌ పేసర్‌ షమీ ఈ మ్యాచ్‌లోనూ తన స్థాయిని ప్రదర్శించాడు. తొలి ఓవర్‌ చివరి బంతికి అభిషేక్‌ శర్మ (0)ను వెనక్కి పంపించిన అతను, తన రెండో ఓవర్‌ తొలి బంతికే ట్రవిస్‌ హెడ్‌ (8 బంతుల్లో 7; 1 ఫోర్‌)ను అవుట్‌ చేశాడు. ఇద్దరు విధ్వంసక ఆటగాళ్ల పని పట్టిన షమీ నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండానే తన స్పెల్‌ను 4–0–9–2తో ముగించాడు. 

మరోవైపు కెప్టెన్ ఇషాన్‌ కిషన్‌ (4 బంతుల్లో 1), లివింగ్‌స్టోన్‌ (20 బంతుల్లో 14; 1 సిక్స్‌) కూడా వెనుదిరగడంతో స్కోరు 26/4 వద్ద నిలిచింది. పవర్‌ప్లేలో 22 పరుగులే చేసిన రైజర్స్‌ 10 ఓవర్లు ముగిసేసరికి 35 పరుగులకే పరిమితమైంది.  

ఆ మూడు సిక్స్‌లు...
లక్నో స్పిన్నర్‌ దిగ్వేశ్‌ ‘నోట్‌బుక్‌’ రాఠీపై నితీశ్‌ రెడ్డి విరుచుకు పడ్డాడు. రాఠీ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో నితీశ్‌ మూడు సిక్స్‌లు బాదాడు. అప్పటికే జోరు మొదలు పెట్టిన నితీశ్‌ దూసుకుపోయాడు. లాంగాన్, లాంగాఫ్‌ దిశగా వరుసగా రెండు సిక్స్‌లు బాదిన అతను మరో మూడు బంతులకు లాంగాన్‌ వైపే అలవోకగా మరో సిక్స్‌ను మలిచాడు. ఈ షాట్లతో ఉప్పల్‌ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి.  

నిరంతరం శ్రమిస్తేనే...
క్రికెట్‌లో కొనసాగాలంటే... ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందే. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే నైపుణ్యాలను మెరుగు పరుచుకోగలం. అందుకే నేను దేశవాళీల్లో అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్నా. నిరంతరం శ్రమిస్తూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అభిషేక్, హెడ్‌ వంటి వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకుంటారు. అందుకే ఆ రెండు వికెట్లు ఎంతో కీలకం. 

టీమిండియా తరఫున ఆడుతున్న సమయం నుంచే బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో చక్కటి అనుబంధం ఉంది. అదే ఇప్పుడూ కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచ్‌ కీలకమైంది. నైపుణ్యం లేకుండా ఏదీ సాధ్యం కాదు. గతంలో ఇక్కడ స్లో బంతులతో ఫలితం సాధించిన అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించా. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా.   –షమీ, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌

18 సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ వేసిన డాట్‌ బాల్స్‌. షమీ 24 బంతుల్లో కేవలం ఆరు బంతులకే  సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు తొమ్మిది పరుగులు సాధించారు. షమీ ప్రదర్శనకుగాను అతనికి ‘డాట్‌ బాల్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వరీనాథ్‌ చేతుల మీదుగా షమీ ఈ పురస్కారం అందుకున్నాడు.  

5  ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై లక్నోకిది ఐదో విజయం. ఈ ఐదింటిలో నాలుగు ఛేజింగ్‌లోనే వచ్చాయి. ఈ నాలుగింటిలో మూడింట లక్నో ఐదు వికెట్ల తేడాతో నెగ్గడం విశేషం. ఒక మ్యాచ్‌లో ఏడు వికెట్లతో గెలవగా, మరో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 

స్కోరు వివరాలు 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) షమీ 7; అభిõÙక్‌ (సి) సిద్ధార్థ్‌ (బి) షమీ 0; ఇషాన్‌ కిషన్‌ (బి) ప్రిన్స్‌ 1; లివింగ్‌స్టోన్‌ (సి) పంత్‌ (బి) రాఠీ 14; క్లాసెన్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ 62; నితీశ్‌ రెడ్డి (సి) ప్రిన్స్‌ (బి) సిద్ధార్థ్‌ 56; అనికేత్‌ (నాటౌట్‌) 2; దూబే (బి) అవేశ్‌ 0; శివాంగ్‌ (బి) ప్రిన్స్‌ 5; హర్షల్‌ (రనౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–11, 4–26, 5–142, 6–144, 7–144, 8–151, 9–156. బౌలింగ్‌: షమీ 4–0–9–2, దిగ్వేశ్‌ రాఠీ 4–0–46–1, ప్రిన్స్‌ యాదవ్‌ 4–0–34–2, సిద్ధార్థ్‌ 4–0–29–1, అవేశ్‌ 4–0–36–2.  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) శివాంగ్‌ 45; మిచెల్‌ మార్ష్ (సి) నితీశ్‌ (బి) మలింగ 14; పంత్‌ (నాటౌట్‌) 68; బదోని (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) దూబే 12; పూరన్‌ (రనౌట్‌) 1; సమద్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) దూబే 16; ముకుల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–37, 2–77, 3–102, 4–105, 5–139. బౌలింగ్‌: హర్ష్ దూబే 4–0–18–2, నితీశ్‌ రెడ్డి 1–0–14–0, ఉనాద్కట్‌ 3.5–0–50–0, ఇషాన్‌ మలింగ 4–0–30–1, హర్షల్‌ 3–0–16–0, శివాంగ్‌ 4–0–30–1.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement