బార్సిలోనాతో ముదిరిన మెస్సీ వివాదం

Lionel Messi Skips Medical As La Liga Sides With Barcelona - Sakshi

కాంట్రాక్టుల విషయంలో తప్పు పట్టిన ‘ల లిగ’

బార్సిలోనా: ‘ఇక జట్టుతో కలిసి ఆడలేను... నన్ను విడుదల చేయండంటూ గత కొన్ని రోజులుగా మొత్తుకుంటూ వస్తోన్న తమ జట్టు ఆటగాడు లియోనెల్‌ మెస్సీ విషయంలో నిన్నటి దాకా మౌనంగా ఉన్న బార్సిలోనా... తాజాగా నోరు విప్పింది. మెస్సీ జట్టును వీడాలనుకుంటే... ఒప్పందంలో ఉన్న విడుదల షరతు ప్రకారం 700 మిలియన్‌ యూరోల (దాదాపు రూ. 6 వేల కోట్లు)ను చెల్లించాలంటూ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అప్పుడే తాము మెస్సీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేసుకుంటామని బార్సిలోనా స్పష్టం చేసింది. వాస్తవానికి మెస్సీ కాంట్రాక్టు వచ్చే ఏడాదితో ముగుస్తుంది. అయితే ఏడాది ముందుగానే జట్టును వీడాలనుకున్న మెస్సీ... ఆ విషయాన్ని జట్టుకు తెలిపాడు. అందుకు ఒప్పందంలో ఉన్న ‘రద్దు నిబంధన’ను సైతం సూచించాడు. (చదవండి: సంయుక్త విజేతలుగా భారత్, రష్యా)

దాని ప్రకారం మెస్సీ... ఒప్పందం గడువు కంటే ముందే జట్టును వీడాలనుకుంటే ఆ విషయాన్ని ఈ ఏడాది జూన్‌ 10 లోపు బార్సిలోనా యాజమాన్యానికి తెలియజేయాలి. అయితే మెస్సీ ఈ నెలలో జట్టును వీడతానని చెప్పడంతో... రద్దు నిబంధన చెల్లదంటూ బార్సిలోనా పేర్కొంది. అయితే ఈ విషయంలో మెస్సీ లాయర్ల వాదన మరోలా ఉంది. కరోనా వల్ల ‘ల లీగ’ తాజా సీజన్‌ జూలై వరకు జరగడంతో... ఆగస్టు 31 వరకు రద్దు నిబంధనను ఉపయోగించే వీలు మెస్సీకి ఉందని లాయర్లు పేర్కొంటున్నారు. ఈ వివాదంలో ‘ల లీగ’ బార్సిలోనాకే మద్దతు పలకడం విశేషం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బార్సిలోనాను వీడాలనుకుంటున్న మెస్సీకి ఇప్పుడు రెండే దార్లు ఉన్నాయి. అందులో ఒకటి... అతడు 700 మిలియన్‌ యూరోలను చెల్లించడం... రెండోది అతడి కోసం వేరే జట్టు ఆ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించడం. 20 ఏళ్లుగా తమకు సేవలు అందించిన మెస్సీ పట్ల బార్సిలోనా ఇంత కఠినంగా వ్యవహరించడం మంచిది కాదంటూ అతడి అభిమానులు పేర్కొంటున్నారు.  

కరోనా పరీక్షకు మెస్సీ దూరం
2020–21 ‘ల లీగ’ ఫుట్‌బాల్‌ లీగ్‌లో భాగంగా... బార్సిలోనా జట్టు ప్రీ సీజన్‌ ట్రయినింగ్‌ క్యాంపును ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తమ ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా... మెస్సీ మాత్రం అందుకు దూరంగా ఉన్నాడు. అతడు మాత్రమే కరోనా పరీక్ష చేయించుకోలేదని ఆ జట్టు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్యాంపు నేటి నుంచి ఆరంభం కానుంది.(చదవండి: హామిల్టన్‌కే టైటిల్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top