
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం (బుధవారం) సందర్భంగా క్రీడాలోకం శుభాకాంక్షలు తెలిపింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా... అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జెర్సీని బహుమతిగా పంపించాడు. రెండు మూడు రోజుల్లో మెస్సీ అందించిన జెర్సీని ప్రధానికి బహుకరించనున్నట్లు ప్రమోటర్ సతాద్రు దత్తా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మెస్సీ భారత్‌లో పర్యటించనున్నాడు.
ఇందులో భాగంగా కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో అతడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ‘మెస్సీని కలిసినప్పుడు ప్రధాని 75వ పుట్టిన రోజు రానుందని చెప్పాను. దీంతో అతడు వరల్డ్‌కప్ విన్నింగ్ జెర్సీపై తన ఆటోగ్రాఫ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు’ అని సతాద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా–2025’ పేరిట మెస్సీ పర్యటన కోల్‌కతా నుంచి ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా మెస్సీ భారత్‌లో పర్యటించాడు. వెనిజులాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు అప్పట్లో కోల్‌కతాకు వచ్చింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌లో అర్జెంటీనా జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు కేరళాలోపర్యటించనుందని... ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దురెహమాన్ వెల్లడించారు.