జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్‌

KTR Launches Jwala Gutta Academy Of Excellence In Moinabad - Sakshi

'ఒలింపియన్లను తయారు చేయడమే నా లక్ష్యం' 

సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లోని సుజాత స్కూల్‌లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్,  క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. 

కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. అకాడమీ స్థాపించిన జ్వాల గుత్తాకి, ఆమె కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. చైనాలో లాగా భారత్‌లోనూ  స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తామని వివరించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనన్నారు. జ్వాల అకాడమీ నడిపేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. 

జ్వాల గుత్తా మాట్లాడుతూ.. అకాడమీ కల నెరవేరింది. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన జ్వాల.. తనలాంటి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అకాడమీ స్థాపించడం గర్వకారణమని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత ప్రతిభని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top