ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది.
ఢిల్లీకి ఛేజింగ్ పరంగా ఇదే అతి పెద్ద విజయం. ఈ రికార్డు విజయంలో కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)లది కీలక పాత్ర. వీరిద్దరూ తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.
ఆ తర్వాత నిస్సాంక ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఆ తర్వాత ఆశుతోష్, స్టబ్స్ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక హాఫ్ సెంచరీతో సత్తాచాటిన రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ఓపెనర్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఓపెనర్‌గా రాహుల్ ఖాతాలో 202 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(192) ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్లు
కేఎల్ రాహుల్ - 202* సిక్సర్లు
విరాట్ కోహ్లీ - 192 సిక్సర్లు
రోహిత్ శర్మ - 148 సిక్సర్లు
శిఖర్ ధావన్ - 143 సిక్సర్లు
శుభమాన్ గిల్ - 129 సిక్సర్లు
అదేవిధంగా ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో రాహుల్ నాలుగో స్ధానంలో జడేజా సరసన నిలిచాడు. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ(21) అగ్రస్ధానంలో ఉన్నాడు.
అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఇండియన్స్ వీరే
21 - రోహిత్ శర్మ
20 - విరాట్ కోహ్లీ
18 - ఎంఎస్ ధోని
17 - రవీంద్ర జడేజా
17 - KL రాహుల్*


