న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు పొందిన విలియమ్సన్ అన్ని పార్మాట్లకు గుడ్‌బై చెప్పినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆడుతోంది.
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ విలియమ్సన్ ఆడాడు. అయితే వీడ్కోలు మ్యాచ్‌గా రెండో టెస్టు ఆడేందుకు విలియమ్సన్ మొగ్గు చూపలేదని, దీంతో లార్డ్స్ టెస్టుతో కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడని కివీస్ బోర్డు స్పష్టం చేసింది. లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు విలియమ్సన్ పేర్కొన్నాడు.
‘రిటైర్మెంట్‌పై కొంతకాలంగా ఆలోచిస్తున్నా. నా వీడ్కోలుకు ఇదే సరైన సమయం అనిపించింది. 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. కివీస్‌కు ఐసీసీ మేజర్ టోర్నీ లేదనే భావన మాలో బలంగా ఉండిపోయింది. కానీ 2021లో భారత్‌ను ఓడించి ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం ద్వారా మా ఖాతాలోనూ ఒక ఐసీసీ టైటిల్ వచ్చి చేరింది.
న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. జట్టు కోసం ఆడాలనే నా తపన, కష్టం ఊరికే పోలేదు. కివీస్ తరఫున నేను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డి ఆడడం గర్వంగా భావిస్తున్నా. అన్నీ ఆలోచించే రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు.’ అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
2010లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విలియమ్సన్ భారత్‌తో తాను ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో విలియమ్సన్ అన్ని ఫార్మాట్లు కలిపి 378 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 19, 346 పరుగులు సాధించిన విలియమ్సన్ ఖాతాలో 48 సెంచరీలున్నాయి. తద్వారా న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గానూ విలియమ్సన్ రికార్డులకెక్కాడు.
ఇక కేన్ విలియమ్సన్ తన కెరీర్‌లో 110 టెస్టులాడి 9,515 పరుగులు (33 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు), 175 వన్డేల్లో 7,256 పరుగులు (15 సెంచరీలు, 47 హాఫ్‌సెంచరీలు), 93 టీ20ల్లో 2,575 పరుగులు (18 హాఫ్ సెంచరీలు) చేశాడు. ఇక న్యూజిలాండ్ సారథిగా కేన్ విలియమ్సన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. విలియమ్సన్ మొత్తం 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20ల్లో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అతడి సారథ్యంలో న్యూజిలాండ్ 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడింది. ఈ రెండింటిలోనూ కివీస్ రన్నరప్‌కే పరిమితమైంది. అయితే 2021లో భారత్‌తో జరిగిన తొలి ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను గెలిచిన న్యూజిలాండ్ తొలి మేజర్ ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2019లో ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్న కేన్ విలియమ్సన్ నాలుగుసార్లు రిచర్డ్ హార్డ్‌లీ మెడల్ కైవసం చేసుకున్నాడు.
ఇక ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన కేన్ విలియమ్సన్‌ను అందరు ముద్దుగా ‘కేన్ మామ’ అని పిలుచుకుంటారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌కు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
చదవండి: FIFA WC 2026: మెస్సీ వర్సెస్ రొనాల్డో పోరు ఎప్పుడంటే!


