ప్రతీకార విజయం.. టేబుల్‌ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌! | IPL 2026 SRH Vs PBKS, SRH Take Revenge Beating Punjab Kings By 33 Runs, Check Out Score Details And Highlights Inside | Sakshi
Sakshi News home page

SRH Vs PBKS: ప్రతీకార విజయం.. టేబుల్‌ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌!

May 6 2026 11:19 PM | Updated on May 7 2026 1:08 PM

IPL 2026: SRH Take-Revenge Beating Punjab Kings By 33 Runs

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. 

కూపర్ కన్నోలీ (107 నాటౌట్‌) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్‌, శివాంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్‌కుమార్‌, మలింగ, సాకిబ్ హుస్సేన్‌ తలా ఒక వికెట్ తీశారు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

ఇషాన్‌, క్లాసెన్ మెరుపులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్‌కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్‌, నితీశ్‌రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.

కొంపముంచిన టాపార్డర్‌..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. 

ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్‌లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.

పట్టికలో ఫస్ట్‌ ప్లేస్‌కు
ఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement