పాటిదార్‌ ఊచకోత.. గుజరాత్‌ చిత్తు.. ఫైనల్లో ఆర్సీబీ | IPL 2026 Qualifier 1, RCB Beat Gujarat Titans Enters Finals, Check Out Score Details And Match Highlights Inside | Sakshi
Sakshi News home page

RCB Vs GT: పాటిదార్‌ ఊచకోత.. గుజరాత్‌ చిత్తు.. ఫైనల్లో ఆర్సీబీ

May 26 2026 11:47 PM | Updated on May 27 2026 10:52 AM

IPL 2026 Qualifier 1: RCB beat Gujarat Titans enters finals

ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టు.. ఇవాళ (మే 26) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది.

ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ మహోగ్రరూపం (33 బంతుల్లో 93 నాటౌట్‌; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) దాల్చాడు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్‌ అయ్యర్‌ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 19 పరుగులు, విరాట్‌ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 43, పడిక్కల్‌ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్‌ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్‌ డేవిడ్‌ 5 బంతుల్లో 4, జితేశ్‌ శర్మ 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 15 పరుగులు (నాటౌట్‌) చేశారు. గుజరాత్‌ బౌలర్లలో​ హోల్డర్‌, రబాడ తలో 2, ప్రసిద్ద్‌‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సాయి సుదర్శన్‌ (14) దురదృష్టవశాత్తు హిట్‌ వికెట్‌గా వెనుదిరగడంతో ఈ జట్టు పతనం ప్రారంభమైంది. ఆతర్వాత  కొద్ది సేపటికే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (2).. 51 పరుగుల వద్ద బట్లర్‌ (29), నిషాంత్‌ సింధు (5), హోల్డర్‌ (0) ఔట్‌ కావడంతో పవర్‌ ప్లేలోనే (5.4 ఓవర్లలో) ఓటమి ఖరారైంది. 

ఆతర్వాత స్వల్ప వ్యవధిలో సుందర్‌ (8), రషీద్‌ ఖాన్‌ (8), రబాడ (9) కూడా ఔట్‌ కావడం 100 పరుగులలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే ఆఖర్లో తెవాతియా (68) బ్యాట్‌ ఝులిపించడంతో జట్టు స్కోర్‌ 100 పరుగుల మార్కు దాటింది. అంతిమంగా గుజరాత్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, భువీ, రసిక్‌, కృనాల్‌ తలో 2, హాజిల్‌వుడ్‌ ఓ వికెట్‌ తీసి గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement