ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో అన్నీ ఓవర్లను పేసర్లే వేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది 13వ సారి మాత్రమే. చివరిగా ఇలాంటి సందర్భం 2016 ఎడిషన్‌లో వచ్చింది. ఆ ఎడిషన్‌లో ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో అన్నీ ఓవర్లు పేసర్లే వేశారు. ఒక్క ఓవర్‌ను కూడా స్పిన్నర్ వేయలేదు.
నిన్నటి ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 39 ఓవర్లను పేస్ బౌలర్లే వేశారు. ఈ రికార్డుకు సంబంధించి 2008 ఎడిషన్‌లో ఆర్సీబీ-సీఎస్‌కే మ్యాచ్ (39.4 ఓవర్లు) తొలి స్థానంలో ఉంది. తాజా మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలోనే ఛేదించింది. లేదంటే ఆర్సీబీ-సీఎస్‌కే మ్యాచ్ రికార్డు కూడా బద్దలయ్యేది.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరో వైపు ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అక్షర్, చహల్‌కు పని లేదు..!
నిన్నటి మ్యాచ్‌లో పిచ్ పేసర్లకు అనుకూలంగా మారడంతో ఇరు జట్ల కెప్టెన్లు స్పిన్నర్లను పక్కన పెట్టారు. స్వయంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బంతి తీసుకోలేదు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చహల్‌ను జట్టులోకి తీసుకున్నా, అతనికి బంతినివ్వలేదు. అక్షర్ బౌలింగ్ వేయకపోయినా బ్యాటింగ్‌లో మెరిసి తన జట్టును గెలిపించుకున్నాడు.


