వైభవ్‌కు మరో భారీ జాక్‌పాట్..? | IPL 2026 Prize Money: How Much Will RCB, GT, Orange Cap, Purple Cap And MVP Get, Check Interesting Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2026 Prize Money: వైభవ్‌కు మరో భారీ జాక్‌పాట్..?

May 31 2026 1:27 PM | Updated on May 31 2026 3:58 PM

IPL 2026 Prize Money: How Much Will RCB, GT, Orange Cap, Purple Cap, MVP Get

ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతుండగా, ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతులు కూడా ఆకర్షణగా నిలిచాయి. విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా, రన్నరప్‌కు రూ.13 కోట్లు అందనున్నాయి.

ఈ సీజన్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మూడుసార్లు తలపడగా, ఆర్సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిచే జట్టు ట్రోఫీతో పాటు భారీ చెక్కును కూడా సొంతం చేసుకోనుంది.

ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లకు దక్కే ప్రైజ్ మనీ
ఫైనల్ విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్‌కు రూ.13 కోట్లు అందనున్నాయి. ఇక క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో నిష్క్రమించిన ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ.6.5 కోట్లు లభించనున్నాయి.

వైభవ్‌కు మరో భారీ జాక్‌పాట్‌..?
ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోరు ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల చిచ్చరపిడుగు, రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గుజరాత్‌ ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (722), సాయి సుదర్శన్‌ (710) కూడా ఇంకా రేసులోనే ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ విజేతకు రూ.10 లక్షలు అందుతాయి.

పర్పుల్ క్యాప్ కోసం రబడా–భువీ పోటీ
పర్పుల్‌ క్యాప్‌ రేసులో గుజరాత్‌ పేసర్‌ రబాడ 28 వికెట్లతో ముందంజలో ఉన్నాడు. ఆర్సీబీ పేసర్‌ భువనేశ్వ్‌ర్‌ కుమార్‌ 26 వికెట్లతో రబాడ వెన్నంటే ఉన్నాడు. పర్పుల్ క్యాప్ గెలిచే బౌలర్‌కు కూడా రూ.10 లక్షల బహుమతి ఉంటుంది.

ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు వైభవ్ ఫేవరెట్
ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్‌ ఆర్య (పంజాబ్‌ కింగ్స్‌)మధ్య పోటీ నెలకొంది. ఈ అవార్డు గెలిచే ఆటగాడికి రూ.20 లక్షలు అందుతాయి.

ఎంవీపీగా ఎవరు..?
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ (436.5 పాయింట్లు), కగిసో రబడా (408), జోఫ్రా ఆర్చర్‌ (396.5) మధ్య పోటీ కనిపిస్తోంది. ఎంవీపీ విజేతకు రూ.10 లక్షలు దక్కనున్నాయి.

ఫెయిర్‌ప్లే అవార్డు
ఈ సీజన్‌లో ఫెయిర్‌ప్లే పట్టికలో పంజాబ్‌ కింగ్స్‌ ముందంజలో ఉంది. ఫెయిర్‌ప్లే అవార్డు గెలిచే జట్టుకు రూ.10 లక్షల నగదు బహుమతి అందుతుంది.

ఐపీఎల్ ప్రైజ్ మనీ చరిత్ర
2008, 2009 సీజన్లలో విజేతలకు కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. 2010 నుంచి రూ.10 కోట్లకు పెంచిన బీసీసీఐ, 2014లో రూ.15 కోట్లు చేసింది. 2016 నుంచి విజేతలకు రూ.20 కోట్లు అందిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావంతో 2020లో మాత్రమే రూ.15 కోట్లకు తగ్గించింది. 2021 నుంచి మళ్లీ రూ.20 కోట్లే కొనసాగుతున్నాయి.

ఈసారి మొత్తం అవార్డుల రూపంలో బీసీసీఐ సుమారు రూ.47.1 కోట్లను పంపిణీ చేయనుంది. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా, ఐపీఎల్ 2026లో ఆటగాళ్లు, జట్లపై కనక వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement