CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! | IPL 2026: MS Dhoni Dewald Brevis likely to play CSK Next match | Sakshi
Sakshi News home page

CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

Apr 6 2026 4:06 PM | Updated on Apr 6 2026 4:31 PM

IPL 2026: MS Dhoni Dewald Brevis likely to play CSK Next match

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గతేడాది అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది సీఎస్‌కే. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. తమ చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

హ్యాట్రిక్‌ పరాజయాలు
ఇక ఐపీఎల్‌-2026ను కూడా చెన్నై ఓటమితోనే ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిన సీఎస్‌కే.. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌కు మ్యాచ్‌ను చేజార్చుకుంది. తాజాగా ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన విఫలమైంది. ఈ నేపథ్యంలో చెన్నై ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.

ధోని, బ్రెవిస్‌ దూరం
ఇదిలా ఉంటే.. దిగ్గజ కెప్టెన్‌, చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్‌ ధోని గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమిండియా టీ20 స్టార్‌, వరల్డ్‌కప్‌ విజేత సంజూ శాంసన్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఇక ధోనితో పాటు యువ ఆటగాడు, పవర్‌ హిట్టర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌కి ధోని అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. ధోని ఫిట్‌నెస్‌ పరీక్షకు సిద్ధంగా ఉన్నాడు.

ఇద్దరూ వచ్చేస్తున్నారు
అదే విధంగా డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా బ్రెవిస్‌ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మధ్య ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగల సత్తా ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌కు ఉంది. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ..

‘‘తదుపరి మ్యాచ్‌ వరకు అంతా సర్దుకుంటుందనే అనుకుంటున్నాం. తర్వాతి మ్యాచ్‌కు మాకు ఐదు రోజుల సమయం ఉంది. ఈ ఓటమి బాధించింది. అయితే, మా ప్రణాళికలకు అనుగుణంగా తదుపరి మ్యాచ్‌లో ముందడుగు వేయగలమనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకవేళ ధోని, బ్రెవిస్‌ తిరిగి వస్తే సీఎస్‌కే గాడిన పడుతుందని చెప్పవచ్చు. కాగా తదుపరి మ్యాచ్‌లో సొంత మైదానం చెపాక్‌ వేదికగా చెన్నై ఏప్రిల్‌ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

చదవండి: ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’

Advertisement
 
Advertisement
Advertisement