‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’ | Ek tha jo wicket ke peeche se: CSK Fans Lambasts After RCB troll Dhoni | Sakshi
Sakshi News home page

‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’

Apr 6 2026 1:23 PM | Updated on Apr 6 2026 1:44 PM

Ek tha jo wicket ke peeche se: CSK Fans Lambasts After RCB troll Dhoni

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన ఆర్సీబీ.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే)ను చిత్తు చేసింది.

43 పరుగుల తేడాతో జయభేరి
బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ ఓడిన ఆర్సీబీ (RCB vs CSK) తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో కేవలం 207 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

ఫలితంగా ఆర్సీబీ చెన్నైపై 43 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా రెండో విజయం నమోదు చేసి.. నాలుగు పాయింట్లు సాధించింది. భారీ నెట్‌రన్‌రేటు (+2.501) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు.

దుమ్మెత్తిపోస్తున్న సీఎస్‌కే ఫ్యాన్స్‌ 
మరోవైపు.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ మాత్రం ఆర్సీబీ సోషల్‌ మీడియా వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, సీఎస్‌కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్‌ ధోనిని అవమానించేలా పోస్టు పెట్టడమే ఇందుకు కారణం.

కాగా 44 ఏళ్ల వయసులోనూ ధోని (MS Dhoni) ఐపీఎల్‌-2026 ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా ఆరంభ మ్యాచ్‌లకు ఈ దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దూరమయ్యాడు. ఈ క్రమంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలోని చెన్నై వరుసగా మూడు పరాజయాలతో చతికిలపడింది. దీంతో ధోని లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

ధోనిని కించపరిచేలా..
ఈ నేపథ్యంలో ధోనిని కించపరిచేలా ఆర్సీబీ ఓ పోస్టు పెట్టింది. చెన్నై ఇన్నింగ్స్‌లో పదో ఓవర్లో అభినందన్‌ సింగ్‌ వేసిన ఐదో బంతిని శివం దూబే షాట్‌ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకుని దూబే పెవిలియన్‌ చేరేలా చేశాడు.

అప్పట్లో ఒకడుండేవాడు వికెట్ల వెనుక
ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆర్సీబీ.. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు వికెట్ల వెనుక’’ అంటూ పరోక్షంగా ధోనిని ఉద్దేశించి క్యాప్షన్‌ జతచేసింది. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

‘‘ఒక్క టైటిల్‌ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఓ చెత్త జట్టు.. ఒక్కసారి గెలవగానే చిల్లర బుద్ధి చూపిస్తోంది. ధోని ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచాడు. అయినా ఎప్పుడూ సీఎస్‌కే ఇలాంటి చిల్లరవేషాలు వేయలేదు’’ అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.

చదవండి: IPL 2026: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement