ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మరో ఫాస్ట్ బౌలర్ ఈ జాబితాలోకి చేరాడు. స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ సైతం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకొన్నాడు.
మరోవైపు శ్రీలంక మతీషా పతిరానకు ఇంకా ఎన్‌వోసీ లభించలేదు. అతడు ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బంగ్లాస్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కూడా కేకేఆర్ కోల్పోయింది. అతడి స్ధానంలో ఇప్పటికే జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజరాబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది. అయితే ఇప్పుడు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ స్ధానాలను భర్తీ చేసే పనిలో పడింది.
కేకేఆర్‌లోకి సిమర్‌జీత్
హర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేసర్ సిమర్‌జీత్ సింగ్‌ను తీసుకోవాలని కేకేఆర్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతడిని ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిమర్‌జీత్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతకుముందు సీఎస్‌కే తరపున మూడు సీజన్ల పాటు ఆడాడు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా అద్భుతమైన యార్కర్లు కూడా సంధించగలడు.
అయితే గతేడాది జరిగిన వేలంలో మాత్రం అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు హర్షిత్ రాణా గాయం రూపంలో అతడికి మరోసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కనుంది. ఇక ఆకాష్ దీప్ స్ధానాన్ని ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్వాల్‌కు ఐపీఎల్ అనుభవం ఉంది. ఐపీఎల్-2023 ఎలిమినేటర్‌లో 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే మధ్వాల్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?


