సీఎస్‌కే చేతిలో ఓటమి అనంతరం రహానే వ్యాఖ్యలు | IPL 2026: KKR Captain Ajinkya Rahane Comments After Losing to CSK | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే చేతిలో ఓటమి అనంతరం రహానే వ్యాఖ్యలు

Apr 15 2026 8:33 AM | Updated on Apr 15 2026 8:46 AM

IPL 2026: KKR Captain Ajinkya Rahane Comments After Losing to CSK

ఐపీఎల్‌ 2026లో 20 మ్యాచ్‌లు గడిచినా మూడు సార్లు ఛాంపియన్‌ అయిన కేకేఆర్‌ ఫేట్‌ మారలేదు. ఆ జట్టు ఇంకా గెలుపు కోసం ఎదురు చూస్తూనే ఉంది. నిన్న (ఏప్రిల్‌ 14) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో ఓటమి. ఓ మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దైంది. అత్యల్ప రన్‌రేట్‌తో ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.

నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌ తొలుత బౌలింగ్‌లో పర్వాలేదనిపించినా, బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయింది. 193 లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడి, 32 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. 25 కోట్లు పెట్టి కొన్న గ్రీన్‌ మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఆదుకోవాల్సిన సమయంలో గోల్డెన్‌ డకౌటయ్యాడు. కాంబినేషన్లు మార్చినా ఆ జట్టుకు కలిసి రాలేదు. 

కెప్టెన్‌ రహానే డిమోషన్‌ తీసుకొని సునీల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసినా వర్కౌట్‌ కాలేదు. ప్రతి మ్యాచ్‌లో ఆదుకునే రఘువంశీ కూడా ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. మిగతా బ్యాటర్లంతా షరామామూలుగానే విఫలమయ్యారు. మొత్తంగా కేకేఆర్‌ మరో మ్యాచ్‌లో ఓటమి చవిచూసి, వైఫల్యాల పరంపరను కొనసాగించింది.

మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు కెప్టెన్‌ అజింక్య రహానే తమ జట్టు ప్రదర్శనపై స్పష్టమైన విశ్లేషణ ఇచ్చాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌, కాంబినేషన్‌, ఆటగాళ్ల ఫామ్‌ గురించి మాట్లాడాడు.  

బౌలింగ్‌ యూనిట్‌పై ప్రశంస  
190 పరుగులకే వారిని ఆపడం సంతృప్తినిచ్చింది. పవర్‌ప్లేలో 70 పరుగులు ఇచ్చినా, చాలా బాగా కమ్‌బ్యాక్‌ ఇవ్వగలిగాం. కార్తిక్‌ త్యాగిని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు. అతని పేస్‌ అద్భుతంగా ఉంది. ప్రతి మ్యాచ్‌తో మెరుగవుతున్నాడు.  

బ్యాటింగ్‌లో లోపాలు  
పవర్‌ప్లేలో 36–37 పరుగులు మాత్రమే చేశాం. ఈ దశలో చేసే పరుగులే కీలకం. మధ్య దశలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టంగా అనిపించింది. ఎవరైనా చివరి వరకు ఆడితే ఫలితం వేరేలా ఉండేది. సీఎస్‌కే స్పిన్నర్లు చాలా బాగా బౌలింగ్‌ చేశారు.  

కాంబినేషన్‌ సమస్య  
గత మ్యాచ్‌లో మా కాంబినేషన్‌ బాగానే ఉంది. అయినా ఫలితాలు రాకపోతే కాంబినేషన్‌ మార్చుకోవాల్సి వస్తుంది. కష్ట సమయాల్లో ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలి, కానీ జట్టు గెలవకపోతే ఆలోచించాలి. జట్టులో పాజిటివ్‌ మైండ్‌ సెట్‌ అవసరం. తల ఎత్తుకొని, సెల్ఫ్‌ బిలీఫ్‌తో ముందుకు సాగిలి.

స్పిన్నర్ల ప్రదర్శన  
మా స్పిన్నర్లు, సీఎస్‌కే స్పిన్నర్లు ఇద్దరూ బాగా బౌలింగ్‌ చేశారు. బంతిని పూర్తిగా ఫుల్‌గా వేయకపోతే పెద్ద సిక్స్‌ కొట్టడం కష్టమే.  

మొత్తంగా వరుస ఓటములు ఎదురైనా రహానే మాటల్లో ఇంకా సానుకూల దృక్పదం కనిపించింది. కష్ట సమయాల్లో తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇదే రిపీటైతే మార్పులు కూడా తప్పవని సంకేతం ఇచ్చాడు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పవర్‌ ప్లేలో, ఆతర్వాత కొద్ది ఓవర్ల పాటు ఆ జట్టు ఆడిన విధానం బట్టి చూస్తూ ఇది తక్కువ స్కోరే అని చెప్పాలి. 

కేకేఆర్‌ బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చి సీఎస్‌కే స్కోర్‌ను అదుపు చేశారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ (48), బ్రెవిస్‌ (41), ఆయుశ్‌ మాత్రే (38) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.

అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్‌ ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. పవర్‌ప్లేలో చాలా తక్కువ పరుగులు చేసి లక్ష్యాన్ని భారీగా పెంచేసుకుంది. మధ్య ఓవర్లలో ధాటిగా ఆడదామనే ప్రయత్నం​లో వికెట్లు పారేసుకుంది. 

అంతిమంగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (31 నాటౌట్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ (35) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-21-3), అన్షుల్‌ కంబోజ్‌ (4-0-32-2), అకీల్‌ హొసేన్‌ (4-0-26-1) సత్తా చాటారు.

Advertisement
 
Advertisement
Advertisement