ఎస్‌ఆర్‌హెచ్‌పై రాజస్థాన్‌ గెలుపు | IPL 2026 Eliminator SRH VS RR Match Updates | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌పై రాజస్థాన్‌ గెలుపు

May 27 2026 7:03 PM | Updated on May 27 2026 11:25 PM

IPL 2026 Eliminator SRH VS RR Match Updates

ఎస్‌ఆర్‌హెచ్‌పై రాజస్థాన్‌ గెలుపు
ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌..  వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు), ధృవ్‌ జురెల్‌ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతర​ం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆర్చర్‌ (4-0-58-3), బర్గర్‌ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్‌ రాజ్‌ పూనియా (4-0-39-1), సుషాంత్‌ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.

ఈ గెలుపుతో రాజస్థాన్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ గుజరాత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరింది. 

ఓటమి దిశగా సాగుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌
6.5వ ఓవర్‌- 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి దిశగా సాగుతోంది. యశ్‌రాజ్‌ పూనియా బౌలింగ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (18) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 

నిప్పులు చెరుగుతున్న ఆర్చర్‌
4.4వ ఓవర్‌- 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ పోరాడకుండానే చేతులెత్తేశేలా ఉంది. 57 పరుగుల వద్ద ఆ జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ట్రవిస్‌ హెడ్‌ (17) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ వికెట్‌ ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌కు మూడవది.

పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌
3.3వ ఓవర​్‌- భారీ లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి స్మరణ్‌ రవిచంద్రన్‌ (1) ఔటయ్యాడు. హెడ్‌, క్లాసెన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
2.5వ ఓవర్‌- 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ఫెరియెరాకు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 

ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్‌
244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో బంతికే భారీ షాక్‌ తగిలింది. ఆర్చర్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ డకౌటయ్యాడు.

రాజస్థాన్‌ భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ భారీ స్కోర్‌ చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97), ధృవ్‌ జురెల్‌ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 

ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్‌ స్కోర్‌.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది. 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో సాకిబ్‌ హుసేన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
15.2వ ఓవర్‌- 207 పరుగుల వద్ద రాజస్థాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పరాగ్‌ (26) ఔటయ్యాడు.  

మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
13.5వ ఓవర్‌- 192 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అనంతరం ధృవ్‌ జురెల్‌ ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
10.2వ ఓవర్‌- 137 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. శివాంగ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ (29) ఔటయ్యాడు. 

వైభవ్‌ సెంచరీ మిస్‌
7.6వ ఓవర్‌- 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లో స్మరణ్‌ రవిచంద్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 125-1గా ఉంది. 

6 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 80-0
వైభవ్‌ సూర్యవంశీ 60 (20 బంతుల్లో, 2 ఫోర్లు, 8 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌ 19 (16 బంతుల్లో 3 ఫోర్లు)

దూకుడుగా ఆడుతున్న వైభవ్ 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(36), యశస్వి జైస్వాల్(8) పరుగులు చేశారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌
ఐపీఎల్‌ 2026లో ఇవాళ జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎలిమినేటర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement