ఐపీఎల్-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. రాయల్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఔటైనప్పటికి.. తర్వాత వచ్చిన ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పాటిదార్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి పాటిదార్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పాటిదార్ 40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్ సాధించారు.
వైభవ్ విధ్వంసం
అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. వైభవ్ బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు.
కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో


