ఈసారి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌దే టైటిల్‌..! | IPL 2026: Can SRH repeat their 2016 glory | Sakshi
Sakshi News home page

ఈసారి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌దే టైటిల్‌..!

May 23 2026 12:12 PM | Updated on May 23 2026 12:23 PM

IPL 2026: Can SRH repeat their 2016 glory

ఐపీఎల్‌ 2026 చివరి దశకు చేరింది. టాప్‌-3 జట్ల ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు కాగా.. చివరి బెర్త్‌పై సందిగ్దత నెలకొంది. దీనిపై కూడా ఇవాళ, రేపట్లో క్లారిటీ వస్తుంది. ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి మూడు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. నాలుగో బెర్త్‌ కోసం రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌, ఢిల్లీ పోటీపడుతున్నాయి. 

నేటితో పంజాబ్‌ భవితవ్యం (లక్నోతో మ్యాచ్‌) తేలిపోనుండగా.. ఎల్లుండి రాజస్థాన్‌ (ముంబైతో మ్యాచ్‌), కేకేఆర్‌, ఢిల్లీ (ఈ రెండు జట్లు తలపడనున్నాయి) ఫేట్‌ కూడా డిసైడైపోతుంది. లక్నో, ముంబై, సీఎస్‌కే ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓడినా పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకొని క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. ఆర్సీబీని ఓడించినా ఎస్‌ఆర్‌హెచ్‌ కనీసం రెండో స్థానాన్ని కూడా సాధించలేక మూడో స్థానానికి పరిమితమై ఎలిమినేటర్‌ గండాన్ని ఎదుర్కోనుంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో పోలిస్తే రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉండటంతో గుజరాత్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

టాప్‌-2లో ఉన్న జట్లు క్వాలిఫయర్‌-1లో తలపడతాయి. ఈ లెక్కన ఆర్సీబీ-గుజరాత్‌  మే 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్‌-1లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. 

నాలుగో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారైతే ఆ జట్టుతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్‌-2లో తలపడుతుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ముల్లాన్‌పూర్‌ వేదికగా మే 27, క్వాలిఫయర్‌-2 కూడా అదే ముల్లాన్‌పూర్‌ వేదికగా మే 29న జరుగునున్నాయి. క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు అహ్మదాబాద్‌ వేదికగా మే 31న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీపై విజయం తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. అదేంటంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి టైటిల్‌ గెలిచిన 2016 ఎడిషన్‌లో కూడా అచ్చం ఇలాగే మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 

ఆ సీజన్‌లో ఎలిమినేటర్‌లో కేకేఆర్‌ను, క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో ఆర్సీబీని 8 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్‌లో పరిస్థితి చూస్తుంటే 2016 సీన్లు రిపీటయ్యేలా కనినపిస్తున్నాయి. 

అప్పుడు కూడా గుజరాత్‌, ఆర్సీబీ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నాడు కూడా ఆస్ట్రేలియా ఆటగాడే (డేవిడ్‌ వార్నర్‌) ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు కమిన్స్‌ సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ 2016 సీన్లు పునావృతం​ చేసి మరో టైటిల్‌ సాధించడం ఖాయమని ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ​

Advertisement
 
Advertisement
Advertisement