
Photo Courtesy: BCCI
రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా గుర్తింపు పొందేందుకు మరో ఐదు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. నేటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు.
రోహిత్ ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు. 248 ఇన్నింగ్స్‌ల్లో 278 సిక్సర్లు బాదిన విరాట్ మరో 5 సిక్సర్లు కొడితే హిట్‌మ్యాన్ రికార్డును బద్దలు కొడతాడు. ఐపీఎల్ 2025లో నేడు (ఏప్రిల్ 10) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ ఈ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టేందుకు ఆస్కారముంది.
ఈ మ్యాచ్‌లో విరాట్ ఐదు సిక్సర్లతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేస్తే మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం టీ20ల్లో 99 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ నేటి మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేస్తే హాఫ్ సెంచరీల సెంచరీని పూర్తి చేసుకుంటాడు.
ఓవరాల్‌గా చూస్తే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 141 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 357 సిక్సర్లు బాదాడు. గేల్ తర్వాత రోహిత్, కోహ్లి, ధోని, డివిలియర్స్ ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు..
క్రిస్ గేల్- 357
రోహిత్ శర్మ- 282
విరాట్ కోహ్లి- 278
ఎంఎస్ ధోని- 259
ఏబీ డివిలియర్స్- 251
కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి సిక్సర్ల వీరుడిగా పేరున్న రోహిత్ శర్మ గత రెండు సీజన్ల నుంచి కాస్త మెత్తబడ్డాడు. 2024 సీజన్ నుంచి ఇప్పటివరకు రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదాడు. సిక్సర్ల విషయంలో రోహిత్.. సహచరుడు విరాట్ కంటే ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండేవాడు.
అలాంటిది గత సీజన్ నుంచి రోహిత్ విరాట్ కంటే వెనుకపడిపోయాడు. 2024 సీజన్ నుంచి రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదగా.. విరాట్ 44 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్‌లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 24 సిక్సర్లు బాది లీడింగ్ సిక్స్ హిట్టర్‌గా ఉన్నాడు. పూరన్ తర్వాత మిచెల్ మార్ష్ (15), శ్రేయస్ అయ్యర్ (14) ఉన్నారు.
ఆర్సీబీ, ఢిల్లీ మధ్య ఇవాళ జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నాయి. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీ పైచేయి సాధించినా.. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఢిల్లీకే విజయావకాశలు ఎక్కువగా ఉన్నాయి.
ఇరు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాంతర శక్తులు ఉన్నాయి. ఢిల్లీకి బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఉండగా.. ఆర్సీబీకి హాజిల్‌వుడ్ ఉన్నాడు. ఢిల్లీ తరఫున స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఉండగా.. ఆర్సీబీకి విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆర్సీబీలో ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. ఢిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్, ట్రస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు. మొత్తంగా ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)..
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్