IPL 2023 Final: చెన్నై ఓడిపోతుందని ముందే డిసైడ్‌ చేసేశారు..!

IPL 2023 Final: Runner Up CSK Image On Big Screen At Narendra Modi Stadium Goes Viral - Sakshi

గుజరాత్‌-చెన్నై జట్ల మధ్య నిన్న (మే 28) జరగాల్సిన ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు స్టేడియంలోని జెయింట్‌ స్క్రీన్‌పై కనిపించిన ఓ ఆసక్తిర దృశ్యం ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది. అదేంటంటే.. "చెన్నై సూపర్‌ కింగ్స్‌ రన్నరప్‌" అని బిగ్‌ స్క్రీన్‌పై కొద్ది సెకెన్ల పాటు ప్రదర్శించబడింది. 

ఇది చూసిన అభిమానులు వెంటనే స్క్రీన్‌ షాట్‌ తీసి సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు. సెకెన్ల వ్యవధిలో ఈ న్యూస్‌ దావనంలా వ్యాపించింది. ధోని ఈ సారి ఎలాగైనా టైటిల్‌ సాధిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న సీఎస్‌కే అభిమానులు ఇది చూసి అవాక్కయ్యారు. మ్యాచ్‌ జరగకుండానే తమను రన్నరప్‌గా ఎలా డిసైడ్‌ చేస్తారని మండిపడ్డారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఏమైనా జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. 

అయితే స్క్రీన్‌ టెస్టింగ్‌లో భాగంగా ఇలా జరిగినట్లు నిర్వహకులు  ప్రకటించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఏదైనా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు సంబంధించి విన్నర్‌, రన్నరప్‌ డిక్లేరేషన్‌ను చెక్‌ చేసి చూసుకోవడం సంబంధిత విభాగం వారి విధుల్లో భాగంగా జరుగుతుందని నిర్వహకులు వివరణ ఇచ్చారు.  రన్నరప్‌ సీఎస్‌కే అనే కాకుండా, సీఎస్‌కే విన్నర్‌ అనే డిక్లేరేషన్‌ను కూడా చెక్‌ చేశారని పేర్కొన్నారు. అలాగే గుజరాత్‌కు కూడా విన్నర్‌, రన్నరప్‌ డిక్లేరేషన్‌ను చెక్ చేశారని తెలిపారు. ఇది కేవలం స్క్రీన్‌ టెస్టింగ్‌లో భాగంగా జరిగిందేనని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే, ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వరకు వాతావరణం ప్రశాంతంగా ఉండింది. టాస్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ మొదలైన వర్షం, భారీ వర్షంగా మారి, మ్యాచ్‌ సాధ్యపడకుండా చేసింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు. ఈ రోజు (రిజర్వ్‌ డే) కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ సాధ్యపడకపోతే, లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌ అయిన గుజరాత్‌ను విజేతగా ప్రకటిస్తారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.

చదవండి: IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టిందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top