IPL 2022: బట్లర్‌ భళా... చహల్‌ చాంగుభళా

IPL 2022: Rajasthan Royals Beat Kolkata Knight Riders by 7 Runs - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం

7 పరుగులతో ఓడిన కోల్‌కతా 

బట్లర్‌ సెంచరీ 

చహల్‌ ‘హ్యాట్రిక్‌’

IPL 2022 RR Vs KKR- ముంబై: ఐపీఎల్‌ పుట్టిన రోజున ఇంతకంటే ఆసక్తికర పోరును ఆశించలేమేమో! లీగ్‌ తొలి చాంపియన్, మెరుపు బ్యాటింగ్‌తో తొలి రోజును వెలిగించిన జట్ల మధ్య జరిగిన పోరు హోరాహోరీగా సాగి అభిమానులను అలరించింది. బట్లర్‌ సూపర్‌ సెంచరీకి తోడు యజువేంద్ర చహల్‌ ‘హ్యాట్రిక్‌’ ప్రదర్శన రాజస్తాన్‌ను గెలిపించాయి. చేతిలో 6 వికెట్లతో 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దిశగా సాగిన కోల్‌కతా... 17వ ఓవర్లో చహల్‌కు నాలుగు వికెట్లు సమర్పించుకొని ఓటమికి బాటలు వేసుకుంది. చివరకు 7 పరుగుల తేడాతో రాయల్స్‌ విజయం సాధించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (61 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఈ సీజన్‌లో రెండో సెంచరీ సాధించగా, సంజు సామ్సన్‌ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లో 210 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (51 బంతుల్లో 85; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆరోన్‌ ఫించ్‌ (28 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చహల్‌ ‘హ్యాట్రిక్‌’సహా ఐదు వికెట్లు తీశాడు. 17వ ఓవర్లోని చివరి మూడు బంతుల్లో వరుసగా శ్రేయస్‌ అయ్యర్, శివమ్‌ మావి, కమిన్స్‌లను అవుట్‌ చేసి చహల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు.  

బట్లర్‌ మరో సెంచరీ...
రాజస్తాన్‌ను నియంత్రించడంలో ఒక్క నరైన్‌ మినహా మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. ఎప్పటిలాగే బట్లర్‌ తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించగా... ఈసారి దేవదత్‌ పడిక్కల్‌ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ధాటిని కనబర్చాడు. వరుణ్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టిన బట్లర్, మావి ఓవర్లోనూ వరుసగా 4, 6 బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఆ తర్వాత 29 బంతుల్లోనే అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది.

ఎట్టకేలకు 97 పరుగుల (59 బంతుల్లో) భాగస్వామ్యం తర్వాత పడిక్కల్‌ను అవుట్‌ చేయడంతో కోల్‌కతాకు తొలి వికెట్‌ దక్కింది. అయితే ఆ తర్వాత బట్లర్‌ జోరు కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన సామ్సన్‌ కూడా వేగంగా దూసుకుపోయాడు. ఉమేశ్‌ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టిన అతను రసెల్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కమిన్స్‌ వేసిన ఫుల్‌టాస్‌ను లాంగాన్‌ మీదుగా సిక్స్‌గా మలచి 59 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న బట్లర్‌... అదే ఓవర్లో అవుటయ్యాడు. అయితే చివర్లో హెట్‌మైర్‌ (13 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు రాయల్స్‌కు భారీ స్కోరును అందించాయి. రసెల్‌ వేసిన 20వ ఓవర్లోనే అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు.  

శతక భాగస్వామ్యం...
తొలి బంతికే నరైన్‌ (0) రనౌట్‌తో కోల్‌కతా ఇన్నింగ్స్‌ మొదలైంది. ఆ తర్వాత ఫించ్, శ్రేయస్‌ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. శ్రేయస్‌ తొలి రెండు ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు కొట్టగా, ఐపీఎల్‌లో చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడిన ఫించ్‌ కూడా బౌల్ట్‌ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. చహల్‌ ఓవర్లోనూ మూడు ఫోర్లు, ఆపై మెక్‌కాయ్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఫించ్‌ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 107 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ తర్వాత ఫించ్‌ వెనుదిరగ్గా, 32 బంతుల్లో శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ధాటిగా ఆడాల్సిన తరుణంలో మరో ఎండ్‌లో రాణా (18), రసెల్‌ (0) విఫలం కావడంతో గెలిపించాల్సిన బాధ్యత శ్రేయస్‌పై పడింది. అయితే ఉమేశ్‌ (9 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా చివరకు కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) వరుణ్‌ (బి) కమిన్స్‌ 103; పడిక్కల్‌ (బి) నరైన్‌ 24; సామ్సన్‌ (సి) మావి (బి) రసెల్‌ 38; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 26; పరాగ్‌ (సి) మావి (బి) నరైన్‌ 5; నాయర్‌ (సి) కమిన్స్‌ (బి) మావి 3; అశ్విన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 217.
వికెట్ల పతనం: 1–97, 2–164, 3–183, 4–189, 5–198.
బౌలింగ్‌: ఉమేశ్‌ 4–0–44–0, మావి 4–0–34–1, వరుణ్‌ 2–0–30–0, కమిన్స్‌ 4–0–50–1, నరైన్‌ 4–0–21–2, రసెల్‌ 2–0–29–1.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: ఫించ్‌ (సి) నాయర్‌ (బి) ప్రసిధ్‌ 58; నరైన్‌ (రనౌట్‌) 0; శ్రేయస్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 85; రాణా (సి) బట్లర్‌ (బి) చహల్‌ 18; రసెల్‌ (బి) అశ్విన్‌ 0; వెంకటేశ్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) చహల్‌ 6; జాక్సన్‌ (సి) ప్రసిధ్‌ (బి) మెక్‌కాయ్‌ 8; మావి (సి) పరాగ్‌ (బి) చహల్‌ 0; కమిన్స్‌ (సి) సామ్సన్‌ (బి) చహల్‌ 0; ఉమేశ్‌ (బి) మెక్‌కాయ్‌ 21; వరుణ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 210.
వికెట్ల పతనం: 1–0, 2–107, 3–148, 4–149, 5–178, 6–180, 7–180, 8–180, 9–209, 10–210.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–48–0, ప్రసిధ్‌ 4–0–43–1, మెక్‌కాయ్‌ 3.4–0–41–2, అశ్విన్‌ 4–0–38–1, చహల్‌ 4–0–40–5.

21:ఐపీఎల్‌లో నమోదైన మొత్తం హ్యాట్రిక్‌లు. ఇందులో 12 మంది భారత బౌలర్లు హ్యాట్రిక్‌ తీయగా... అమిత్‌ మిశ్రా మూడుసార్లు, యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు చొప్పున హ్యాట్రిక్‌ సాధించడం విశేషం.

ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top