
థాయ్‌లాండ్‌పై 11–0 గోల్స్‌తో గెలుపు
రెండేసి గోల్స్ చేసిన ముంతాజ్, బ్యూటీ డుంగ్‌డుంగ్, ఉదిత
హాంగ్జౌ (చైనా): ప్రపంచ కప్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా... ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్‌లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా 11–0 గోల్స్ తేడాతో గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముంతాజ్ ఖాన్ (7వ, 49వ నిమిషాల్లో), ఉదిత (30వ, 52వ నిమిషాల్లో), బ్యూటీ డుంగ్‌డుంగ్ (45వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు.
సంగీత కుమారి (10వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (18వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (18వ నిమిషంలో), షర్మిలా దేవి (57వ నిమిషంలో), రుతుజా (60వ నిమిషంలో) టీమిండియాకు ఒక్కో గోల్ అందించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత జట్టు విరామ సమయానికి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవరాల్‌గా తమకు లభించిన తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లలో ఐదింటిని గోల్స్‌గా మలిచిన భారత జట్టు నాలుగింటిని వృథా చేసింది.
మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న థాయ్‌లాండ్ జట్టుకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా దక్కలేదు. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో జపాన్ 9–0తో సింగపూర్ జట్టును ఓడించగా... పూల్ ‘ఎ’లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణ కొరియా 9–0తో చైనీస్ తైపీపై, చైనా 8–0తో మలేసియాపై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జపాన్‌తో భారత్; థాయ్‌లాండ్‌తో సింగపూర్ తలపడతాయి.